తెరాసకే సిపిఐ మద్దతు

October 02, 2019


img

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఉప ఎన్నికలలో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ తెరాస నేతలు కే. కేశవరావు, వినోద్ కుమార్ తదితరులు రెండు రోజుల క్రితం సిపిఐ నేతలను కోరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో వారి అభ్యర్ధనపై చర్చించినా తరువాత తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. కనుక ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్ధి సైదిరెడ్డికి మద్దతుగా సిపిఐ నేతలు ప్రచారంలో పాల్గొంటారు. సిపిఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్‌ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. కనుక హుజూర్‌నగర్‌ ఎన్నికల బరిలో వామపక్షాలు లేకపోవడం, సిపిఐ మద్దతు లభించడం తెరాసకు కలిసివచ్చే అంశమేనని చెప్పవచ్చు. 

గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌, సిపిఐ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ టికెట్ల పంపకాల విషయంలో సిపిఐ పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా చులకనగా వ్యవహరించింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు వచ్చి మద్దతు కోరినప్పటికీ తెరాసకే మద్దతు ఇవ్వాలని సిపిఐ నిర్ణయించి ఉండవచ్చు. సిపిఐ మద్దతు వలన తెరాసకు అదనంగా ఏమైనా ప్రయోజనం లభిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఇక ముందు కూడా ఆ రెండుపార్టీల స్నేహం కొనసాగితే రాష్ట్ర రాజకీయాలలో కొత్త సమీకరణం మొదలైనట్లే భావించవచ్చు.


Related Post