జాగో తెలంగాణ...

October 01, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయపార్టీలకు అనుబందం సంఘాలు, కొన్ని జెఏసీలు, రాజకీయవేదికలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో తాజాగా ‘జాగో తెలంగాణ’ అనే మరో రాజకీయ వేదిక చేరింది. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కమిటీ కన్వీనర్ జె బాలకృష్ణారెడ్డి దీనిని స్థాపించారు. నగరంలోని సోమాజీగూడలో ఉన్న ప్రెస్ క్లబ్బులో సోమవారం దీనిని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇదివరకు అందరం కలిసి కేంద్రంతో కోట్లాడి తెలంగాణ సాదించుకున్నాము. తెలంగాణ ఏర్పడి అప్పుడే 5 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా లోతైన చర్చ జరుగవలసి ఉంది. కనుక మనల్ని మనం చైతన్యపరుచుకొని మన సమస్యలను, అవసరాలను గుర్తించి, వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి తెలుసుకునేందుకు ఈ ‘జాగో తెలంగాణ’ పేరిట ఒక తటస్థ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నాము. ఈనెల 4వ తేదీన మరోసారి సమావేశమయ్యి మా భవిష్య కార్యాచరణను ప్రకటిస్తాము,” అని చెప్పారు.   

ఒకప్పుడు దేశంలో రాజకీయపార్టీలన్నీ... ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాస్వామ్యవిధానాలకు ఎంతో కొంత కట్టుబడి ఉండేవి. కీలకమైన అంశాలపై ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలూ తీసుకునే సత్సాంప్రదాయం ఉండేది. కనుక ప్రతిపక్షాలకు, ఇటువంటి తటస్థ రాజకీయ వేదికలకు సముచిత గౌరవం లభించేది. కానీ గత కొన్నేళ్ళుగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యవిధానాలకు క్రమంగా దూరంగా జరుగుతూ ఏకపక్ష నిర్ణయాలే తీసుకొంటున్నాయి. చట్టసభలలో వాటిపై చర్చలు జరుపుతున్నప్పటికీ, చివరికి ప్రభుత్వాలు తీసుకొంటున్న నిర్ణయాలకు అయిష్టంగానైనా ఆమోదముద్ర వేయకతప్పడం లేదు. కనుకనేటి రాజకీయ వ్యవస్థలో భిన్నస్వరాలకు, అభిప్రాయాలకు అవకాశం లేదనే చెప్పాలి. 

కనుక ఇటువంటి తటస్థ రాజకీయవేదికలు ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాత్రమే వ్యవహరించవలసి ఉంటుంది. తటస్థం పేరుతో ప్రభుత్వ విధానాలను సమర్ధిస్తే అధికార పార్టీకి అనుబందసంఘంగా మిగిలిపోతుంది. కాదని సమస్యలపై చర్చించి మాట్లాడినా, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా వారిపై రాష్ట్ర లేదా దేశవ్యతిరేక శక్తులుగా ముద్రవేసి, ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టడం సర్వసాధారణమైపోయింది. ప్రజలు కూడా ఈవిధానానికే బాగా అలవాటు పడిపోయారు కనుక ఈరోజుల్లో తటస్థంగా ఉండటం సాధ్యపడదనే భావించవచ్చు. కనుక ప్రజలను జాగృతం చేసే ముందు ‘జాగో తెలంగాణ రాజకీయ వేదిక’ ఏ గట్టున ఉండాలో ముందు తేల్చుకోవడం మంచిది.


Related Post