ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ ఏమంటారో?

October 01, 2019


img

శుక్రవారం అర్దరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికసంఘాలు నిరవదిక సమ్మెకు సిద్దమవుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని, తమను ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆర్టీసీలో సుమారు 50,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయదలిస్తే ఒకేసారి వారందరికీ ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న జీతభత్యాలు, సౌకర్యాలు ఈయవలసి ఉంటుంది. అదీగాక ఆర్టీసీకి చెందిన అప్పులను కూడా ప్రభుత్వం స్వీకరించవలసి ఉంటుంది. ఆర్టీసీలో పాతబడిన వేలాది ఆర్టీసీ బస్సుల నిర్వహణ భారం కూడా ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. 

గత ఏడాది ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దపడినప్పుడు సిఎం కేసీఆర్‌ వారితో చాలా కటినంగా వ్యవహరించారు. ఒకవేళ సమ్మెకు దిగితే ఆర్టీసీని మూసివేయవలసి వస్తుందన్నట్లు మాట్లాడారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ సిఎం కేసీఆర్‌ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన ఇంక్రిమెంటు తీసుకొని సమ్మె విరమించవలసి వచ్చింది.

ఈసారి ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లకు తలొగ్గితే ఖజానాపై చాలా భారం పడుతుంది. కనుక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిఎం కేసీఆర్‌ అంగీకరించకపోవచ్చు. రాజకీయ అవసరాలు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఒత్తిడి కారణంగా ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిఎం కేసీఆర్‌ సిద్దంపడినా, ఒకేసారి కాకుండా వచ్చే నాలుగేళ్ళలో దశలవారీగా విలీనం చేసేందుకు మొగ్గు చూపవచ్చు. ప్రస్తుతం సమ్మెను నివారించడానికి ఆర్టీసీ కార్మికులకు ఎంతోకొంత జీతాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వం అంగీకరించవచ్చు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లపై మంత్రివర్గం చర్చించవచ్చు. కనుక ఈసారి సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మిక సంఘాల పట్ల ఏవిధంగా వ్యవహరించబోతున్నారనేది మంత్రివర్గ సమావేశం తరువాత తెలియవచ్చు.


Related Post