ఏపీలో నాలుగు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ.. మరి తెలంగాణలో?

September 30, 2019


img

ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్ సర్కార్ తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది మే30 న జగన్‌ ఏపీ సిఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే నేటితో సరిగ్గా నాలుగు నెలలు పూర్తయ్యాయి. కేవలం ఈ నాలుగు నెలల వ్యవధిలోనే జగన్‌ ప్రభుత్వం కొత్తగా 1.40 లక్షల ప్రభుత్వోద్యోగాలను సృష్టించడం, వాటికి నోటిఫికేషన్‌ ఇవ్వడం, పరీక్షలు నిర్వహించడం, ఉత్తీర్ణులైనవారికి ఈరోజున నియామకపత్రాలు అందించడం ఒక సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి. 

పరిపాలనను గ్రామస్థాయికి వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఒక గ్రామసచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో గ్రామ సచివాలయంలో శాస్విత ప్రాతిపదికన 12 మంది చొప్పున కొత్త ఉద్యోగాలను సృష్టించి భర్తీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సోమవారం ఉదయం విజయవాడలో నియామకపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 

కేవలం నాలుగు నెలల వ్యవదిలో సుమారు 2.50 లక్షల గ్రామ వాలంటీర్ల నియామకాల ప్రక్రియను, 1.40 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చిన్న లోపం కూడా లేకుండా సమర్ధంగా పూర్తిచేసినందుకు సంబంధిత శాఖల అధికారులను, జిల్లా కలెక్టర్లను ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇకపై ప్రతీ ఏడాది జనవరి నెలలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తుంటామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వమొక్కటే ఆలోచిస్తే సరిపోదని, యువతరం కూడా తోడైతేనే సాధ్యపడుతుందని నమ్మినందునే గ్రామసచివాలయాలు ఏర్పాటు చేసి వాటిని యువత చేతిలో పెడుతున్నానని జగన్ అన్నారు. కనుక కొత్తగా ప్రభుత్వోద్యోగాలు పొందిన యువ ఉద్యోగులు అందరూ గ్రామాభివృద్ధిని తమ బాధ్యతగా భావించి పనిచేయాలని సిఎం జగన్ కోరారు. 

ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నేటికీ మీనమేషాలు లెక్కిస్తూనే ఉండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ళ క్రితం ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని ఉద్యోగాలు మాత్రమే భర్తీకాగా, కొన్ని వివిద దశలలో ఉన్నాయి. మరికొన్ని న్యాయస్థానాలలోను ఉన్నాయి. 

తెలంగాణలో నోటిఫికేషన్‌ ప్రకటించిన రోజు నుంచి నియామక పత్రాలు అందజేసేవరకు వివాదాలు, అభ్యంతరాలు, కోర్టులలో పిటిషన్లు దాఖలవడం పరిపాటిగా మారిపోయింది. అందుకు తెరాస నేతలు ప్రతిపక్షాలను నిందిస్తుంటే, ప్రతిపక్షాలు తెరాస సర్కార్‌ను నిందిస్తుంటాయి. కానీ ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై టిడిపి విమర్శలు తప్ప, మరే వివాదాలు, లోపాలు, సమస్యలు లేకుండా కేవలం 4 నెలల వ్యవధిలో ఇన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను జగన్ ప్రభుత్వం సజావుగా పూర్తి చేయగలిగింది. పైగా ఉద్యోగాల నియామక పరీక్షలకు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి క్యాలెండరు (జనవరి) కూడా ప్రకటించారు. తెలంగాణ కంటే ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితులను ఏడుకొంటున్న ఏపీలో ఇవన్నీ సాద్యమైనప్పుడు, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు సాధ్యపడదు? అనే ప్రశ్నకు తెరాస సర్కార్‌ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.


Related Post