తెరాసకు ఓటమి భయం మొదలైందా?

September 30, 2019


img

రాష్ట్ర ప్రజలందరూ తమవైపే ఉన్నారని బల్లగుద్ది వాదించే తెరాస, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో కూడా అవలీలగా గెలుస్తామని చెప్పుకుంటోంది. తాజా సర్వేలో తెరాసకు 55 శాతం విజయావకాశాలున్నాయని ఇటీవలే తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. తెరాస గెలుపుఖాయమని, ఎంత మెజార్టీతో గెలుస్తుందనేదే తెలియవలసి ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, బిజెపి నేతలు ఎగిరెగిరిపడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడి ఉంది. బిజెపి ఇంకా పుంజుకోలేదు. వామపక్షాలకు ఓటు బ్యాంకే లేదని అసెంబ్లీ ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ అన్నారు. కనుక ఈ ఉప ఎన్నికలలో తెరాసకు పోటీయే లేదనుకోవలసి ఉంటుంది. కానీ తెరాసకు ఎందుకో తన గెలుపుపై అనుమానం కలిగినట్లుంది లేదా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే అలవాటున్న కారణంగా, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు తెరాస తన ముందున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే సిపిఐ మద్దతు కోరి ఉండవచ్చు.   

సిపిఐ మద్దతు కోరడానికి కారణం ఏమైనప్పటికీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీనీయబోతోందని తెరాస గ్రహించినట్లే ఉంది. అయితే ఈ ఐదున్నరేళ్ల తెరాస పాలనలో ప్రతిపక్షాల పట్ల చాలా అవమానకరంగా, నిరంకుశంగా వ్యవహరించిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు సిపిఐ మద్దతు కోరడాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు మరోమారు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని కనుక కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని సిపిఐ నేతలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఈ ఉప ఎన్నికలు సిపిఎం కూడా పోటీచేయబోతోంది. కనుక సిపిఐ నేతలు తెరాస, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలలో దేనివైపు మొగ్గుచూపుతారో చూడాలి. ఒకవేళ వారు తెరాసవైపు మొగ్గు చూపినట్లయితే, రాష్ట్రంలో మళ్ళీ కొత్త రాజకీయ సమీకరణాలు మొదలైనట్లే భావించవచ్చు.


Related Post