హుజూర్‌నగర్‌ బరిలో టిడిపి... ఎందుకో?

September 28, 2019


img

రాష్ట్రంలో టిడిపి దాదాపు అదృశ్యమైపోయిందనుకుంటున్న తరుణంలో మళ్ళీ తన ఉనికిని చాటుకోవడానికి సిద్దపడుతోంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో టిడిపి ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీ నేతలు, కార్యకర్తల అభ్యర్ధన మేరకు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా దీనికి ఆమోదం తెలిపారని చెప్పారు. ఆదివారం టిడిపి అభ్యర్ధి పేరును ప్రకటిస్తామని చెప్పారు. 

ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలోను టిడిపికి బలమైన క్యాడర్ ఉన్నమాట వాస్తవం. కానీ ప్రస్తుతం ఆ పార్టీలో నేతలను వేళ్ళమీద లెక్కించవచ్చు. ఇక టిడిపి బలహీనపడటంతో కార్యకర్తలు కూడా చెల్లాచెదురైపోయారు. కనుక ఈ పరిస్థితులలో టిడిపి ఉప ఎన్నికలలో పోటీ చేయాలనుకోవడం ఆశ్చర్యకరమే కాదు కాస్త ఆలోచించదగ్గ విషయం కూడా. 

ఈసీ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక మునుపు హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబునాయుడు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొందామని చెప్పారు. ఆయన ఏదో మాటవరసకు ఆ మాట అనలేదని ఇప్పుడు అర్ధం అవుతోంది. కానీ చంద్రబాబు మళ్ళీ తెలంగాణపై పట్టు సాధించాలని ఎందుకు అనుకొంటున్నారు? అనే సందేహం కలుగకమానదు. దానికి బలమైన కారణమే కనిపిస్తోంది. 

సిఎం కేసీఆర్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అన్నివిధాల సహాయసహకారాలు అందజేసి ఏపీలో చంద్రబాబునాయుడును గద్దె దించారు. ఇదివరకు తెలంగాణలో సిఎం కేసీఆర్‌ టిడిపిని దెబ్బతీసినట్లే, ఇప్పుడు ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి కూడా టిడిపిని తుడిచిపెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక చంద్రబాబునాయుడు తనను తాను, తన పార్టీని కూడా కాపాడుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. 

కేసీఆర్‌ తన అధికారాన్ని, పార్టీని దెబ్బ తీశారు కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ కేసీఆర్‌కు ఎంతో కొంత నష్టం, కలవరం కలిగించాలని చంద్రబాబునాయుడు ఆలోచన కావచ్చు. కనుక టిడిపి గెలవదని తెలిసి ఉన్నప్పటికీ, ఉప ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా ఓట్లు చీల్చి తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి విజయావకాశాలను దెబ్బతీయాలనేది టిడిపి ఆలోచన కావచ్చు. అది నెరవేరుతుందా లేదా అనేది అప్రస్తుతం. కానీ మళ్ళీ తెరాసకు టిడిపి సవాలు విసరగలదని కేసీఆర్‌ గుర్తించేలా చేయడం ఒక కారణం కావచ్చు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-టిడిపిలు పొత్తుపెట్టుకున్నప్పటికీ, ఈ ఉప ఎన్నికలలో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోలేదు. కానీ అంతమాత్రన్న అవి ఒకదానితో మరొకటి పోటీ పడతాయనుకుంటే అది రాజకీయ ఆజ్ఞానమే అవుతుంది. కనుక పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే టిడిపి రంగంలో దిగినట్లు భావించవచ్చు. కనుక ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిస్తే టిడిపి గెలిచినట్లే అవుతుంది.


Related Post