కేసీఆర్‌కు ఆర్ధిక క్రమశిక్షణ లేదు: కిషన్‌రెడ్డి

September 28, 2019


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రవిమర్శలు చేశారు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు ఆర్ధిక క్రమశిక్షణ లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికమాంద్యం నెలకొని ఉండటంతో భారత్‌పై దాని ప్రభావం తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కానీ కేసీఆర్‌ మాత్రం ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా తెలంగాణ బడ్జెట్‌లో కోత విధించి చేతులు దులుపుకున్నారు. కేసీఆర్‌ తన ప్రభుత్వ వైఫల్యాలకు కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పించుకోవాలనుకొంటున్నారే తప్ప రాష్ట్ర ఆర్ధికస్థితిని బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు,” అని విమర్శించారు. 

సిఎం కేసీఆర్‌ శాసనసభలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు, ఆర్ధికమాంద్యం నెలకొని ఉందని దృవీకరించారు. కానీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వాటికోసం అవసరమైతే మరిన్ని రుణాలు తీసుకుంటామని నిర్మొహమాటంగా చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం చాలా అవసరమే. ఆర్ధికమాంద్యం కమ్ముకొస్తున్నప్పుడు ఆదాయం పెంచుకొనే ప్రయత్నాలు చేస్తూనే, చేతిలో ఉన్న డబ్బును పొదుపుగా వినియోగించుకొంటూ ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నాలు చేయాలి. కానీ ఉన్నభవనాలను కూల్చివేసుకొని వందల కోట్లు అప్పులు తెచ్చి కొత్త భవనాలను కట్టుకోవాలనుకోవడాన్నే ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. అందుకే సిఎం కేసీఆర్‌కు ఆర్ధిక క్రమశిక్షణ లేదని కిషన్‌రెడ్డి అనగలిగారు.


Related Post