భారత్‌తో అణుయుద్ధం తప్పదేమో? ఇమ్రాన్ ఖాన్‌

September 28, 2019


img

న్యూయార్క్ లో శుక్రవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 74వ సమావేశాలలో ప్రసంగించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పూర్తిగా సంయమనం కోల్పోయి మాట్లాడారు. వాస్తవానికి కశ్మీర్‌ అంశంలో పాక్‌ అనవసరంగా వేలు పెడుతూ, భారత్‌తో అణు యుద్ధానికి సిద్దమని కవ్విస్తూ, మళ్ళీ అదే నోటితో పాక్‌ స్వేచ్చా స్వాతంత్ర్యాలను కాపాడుకోవడానికి మరణించేవరకు పోరాడుతామని ఇమ్రాన్ ఖాన్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. భారత్‌లో అధికారంలో మోడీ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కశ్మీర్‌ సమస్యను జటిలం చేస్తున్నారని, లోక్‌సభ ఎన్నికలలో బాలాకోట్ దాడుల గురించి ప్రచారం చేసుకోవడమే అందుకు నిదర్శనమని ఇమ్రాన్ ఖాన్‌ అన్నారు. 

మోడీ ప్రభుత్వం లక్షన్నర మంది సైనికులతో కశ్మీర్‌లో లక్షలమంది ప్రజలను, రాజకీయ నేతలను నిర్బందించిందని ఆరోపించారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే మారణహోమం జరుగుతుందని అన్నారు. భారత్‌లో జరిగే ప్రతీ దాడికి పాకిస్థాన్‌ను నిందించడం మోడీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని ఆరోపించారు. పాక్‌ సరిహద్దులలో 500 మంది తీవ్రవాదులు భారత్‌పై దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నారంటూ మోడీ ప్రభుత్వం పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తోందని ఇమ్రాన్ ఖాన్‌ అన్నారు. మళ్ళీ పాక్‌పై దాడులు చేసేందుకే ఆవిధంగా చేస్తోందని ఇమ్రాన్ ఖాన్‌ అనుమానం వ్యక్తం చేశారు. 

భారత్‌ అనుసరిస్తున్న ఈ వైఖరి వలన ఇరు దేశాల మద్య అణుయుద్ధం అనివార్యంగా కనిపిస్తోందని అన్నారు. ఒకవేళ అణుయుద్ధం జరిగితే అది భారత్‌-పాక్‌లకే పరిమితం అవుతుందనుకోవద్దని అది ఇరుగుపొరుగు దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. 

కశ్మీర్‌ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుందుడుకు, నిరంకుశ వైఖరి పట్ల పాకిస్థాన్‌తో సహా భారత్‌లోని ముస్లిం ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. పాశ్చాత్యదేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదం అని పదేపదే అంటుండటం ప్రపంచంలోని ముస్లింలందరినీ అవమానించడమేనని ఇమ్రాన్ ఖాన్‌ అన్నారు. 

భారత్‌ తనకున్న పలుకుబడితో పాకిస్థాన్‌పై ప్రపంచదేశాలతో ఉగ్రవాదదేశంగా ముద్రవేయించి, బ్లాక్ లిస్టులో పెట్టించి నిధులు రాకుండా అడ్డుకొని నిస్సహాయ పరిస్థితులలోకి నెట్టాలని ప్రయత్నిస్తోందని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోపించారు. అటువంటి పరిస్థితులే ఎదురైతే తిరగబడక తప్పదని హెచ్చరించారు. పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిగా చేయడానికి భారత్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచదేశాలన్నీ గమనించాలని, ఆసియాలో మళ్ళీ శాంతిస్థాపనకు  ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్‌ కోరారు.


Related Post