అప్పుడు రైతులు...ఇప్పుడు సర్పంచులు!

September 27, 2019


img

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో తెరాస అభ్యర్ధి కవిత ఓటమికి గల అనేక కారణాలలో 176 మంది పసుపు రైతులు పోటీ చేయడం కూడా ఒకటి. కానీ నేటికీ తెరాస దానిని ఒప్పుకోవడం లేదు అది వేరే సంగతి. అప్పుడు రైతులు పోటీ చేస్తే, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో 251 మంది సర్పంచులు నామినేషన్లు వేయబోతున్నారు. “హలో సర్పంచ్.. హుజూర్‌నగర్‌లో చలో సర్పంచ్” పేరుతో ప్రచారం చేస్తామని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సౌధామి భూమన్న యాదవ్ ప్రకటించారు. తమపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసన తెలియజేయడానికే హుజూర్‌నగర్‌ బరిలో దిగాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలో సర్పంచులు అనేకానేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కానీ ప్రభుత్వంలో తమ గోడు ఆలకించే నాధుడేలేదని అన్నారు. అందుకే గత ఏడాది జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికలలో కూడా తమ సంఘానికి చెందిన 17 మంది సర్పంచులు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో నామినేషన్లు వేశారని చెప్పారు. అయినా ప్రభుత్వం పట్టించుకోనందున తమ ఉనికిని, శక్తిని చాటి చెప్పేందుకు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో 251 మంది సర్పంచులు నామినేషన్లు వేయబోతున్నామని తెలిపారు. 

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో ఇటువంటి పరిస్థితులలోనే బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఒకవేళ హుజూర్‌నగర్‌లో 251 మంది నామినేషన్లు వేసినట్లయితే మళ్ళీ నిజామాబాద్‌ ఫలితాలే పునరావృతమయినా ఆశ్చర్యపోనక్కరలేదు. దీని వలన తెరాసకు ఎంతో కొంత నష్టం కాంగ్రెస్‌, బిజెపిలకు మేలు చేకూర్చవచ్చు. కనుక గత చేదు అనుభవం దృష్టిలో ఉంచుకొని తెరాస ఇప్పుడే మేల్కొంటే మంచిదేమో?


Related Post