తెరాసకు ఓటమి భయం పుట్టుకొంది: కె.లక్ష్మణ్‌

September 27, 2019


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెరాసపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సిఎం కేసీఆర్‌ తన ఐదేళ్ళ పాలనలో ఆర్టీసీ, రెవెన్యూ, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్దులు అన్ని వర్గాలవారిని మోసం చేశారు. మాయమాటలతో మభ్యపెట్టారు తప్ప వారికోసం ఆయన చేసిందేమీలేదు. కనుక ప్రజలు తెరాసకు గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన కూడా గ్రహించినట్లే ఉన్నారు. తెరాసకు ఓటమి భయం పట్టుకొంది. అందుకే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఏదోవిధంగా గట్టెక్కాలని తెరాస విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ హుజూర్‌నగర్‌ ప్రజలు కాంగ్రెస్‌, తెరాసలకు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. కనుక బిజెపి గెలుపు ఖాయం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకొని తెరాసను ఓడించి అధికారంలోకి వస్తాం,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ వైఖరి పట్ల ఆర్టీసీ, రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. కానీ ఆ కారణంగా ఈ ఉప ఎన్నికలలో తెరాసను కాదని బిజెపిని ఎన్నుకొంటారనుకోలేము. వాస్తవానికి హుజూర్‌నగర్‌ జరుగబోయే ముక్కోణపు పోటీలో బిజెపియే చాలా బలహీనంగా ఉందని, పోటీ ప్రధానంగా తెరాస-కాంగ్రెస్‌ పార్టీల మద్యనే సాగబోతోందనే సంగతి కె.లక్ష్మణ్‌కు తెలియదనుకోలేము. ఈ ఉప ఎన్నికలు బిజెపికే ఒక అగ్నిపరీక్ష వంటివని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్రంలో తమకు బలం, ప్రజాధారణ చాలా పెరిగిందని, కాంగ్రెస్‌, తెరాసలకు బిజెపియే ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకొంటున్నందున, ఈ ఉప ఎన్నికలలో అది నిజమని నిరూపించుకోవలసి ఉంటుంది. కనుక తప్పకుండా ఈ సవాలును స్వీకరిస్తున్నామని కె.లక్ష్మణ్‌ చెప్పుకుంటే బాగుండేది. కానీ తెరాసకు ఓటమి భయం పుట్టుకొందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.


Related Post