కాంగ్రెస్‌ గెలిస్తే ఉత్తమ్‌కు మాత్రమే లాభం: కేటీఆర్‌

September 26, 2019


img

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలపై తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో బుదవారం తెలంగాణ భవన్‌లో సమావేశమైనప్పుడు, కేటీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలిస్తే కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ప్రయోజనం పొందుతారు అదే..తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు కనుక ప్రజలందరికీ మేలు కలుగుతుంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలపై చేయించిన తాజా సర్వేలో తెరాసకు 55 శాతం, కాంగ్రెస్ పార్టీ 41 శాతం విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమైంది. ఈసారి ఈవీఎం లేదా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించినా తెరాస గెలవడం ఖాయం. అసెంబ్లీ ఎన్నికలలో తెరాస కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు ఉన్నందునే తెరాస స్వల్ప తేడాతో ఓడిపోయింది. కానీ ఈసారి బారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం.  అయితే తెరాస అభ్యర్ధి ఎంత మెజార్టీతో గెలుస్తారనేదే తెలియవలసి ఉంది. అంతే! ఉప ఎన్నికల ప్రచారానికి సిఎం కేసీఆర్‌ కూడా రాబోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగురవేయాలి,” అని అన్నారు.


Related Post