రెబెల్ ఎమ్మెల్యేలకు ఉపశమనం

September 26, 2019


img

కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ పార్టీలకు చెందిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. 

వారిపై మాజీ స్పీకర్ రమేశ్ అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయిన వారి స్థానాలకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ వారు వేసిన పిటిషన్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున, తుది తీర్పు వెలువడేవరకు 15 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు కోరగా అందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ అంగీకరించింది. 

కాంగ్రెస్‌-జెడిఎస్‌ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు నాటకీయ రాజకీయ పరిణామాల నడుమ హటాత్తుగా తమ పదవులకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌-జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అయితే వారు తమ కాంగ్రెస్‌-జెడిఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చగలిగారు కానీ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేకపోయారు. మాజీ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయడంతో వారికి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన బిజెపిలో చేరే అవకాశం లేకుండా పోయింది. అనర్హతవేటు పడటంతో ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా అవకాశం కోల్పోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 

ఒకవేళ సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పినట్లయితే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభిస్తుంది లేకుంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు.  



Related Post