ట్రంప్ ఒత్తిడికి మోడీ తలొగ్గుతున్నారా?

September 25, 2019


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి ప్రధాని నరేంద్రమోడీ తలొగ్గుతున్నారా? అంటే భారత్‌ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మాటలు వింటే అవుననే అనిపిస్తుంది. మంగళవారం న్యూయార్క్ లో ట్రంప్-మోడీ ద్వైపాక్షిక సమావేశం తరువాత గోఖలే మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌-పాక్‌ ప్రధానులు నరేంద్రమోడీ, ఇమ్రాన్ ఖాన్‌ ఇరువురూ చర్చించుకుంటే కశ్మీర్‌ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చెప్పారు.  పాకిస్థాన్‌తో చర్చలకు భారత్‌ వ్యతిరేకం కాదు. కానీ ముందుగా ఉగ్రవాదానికి అరికట్టేందుకు పాకిస్థాన్‌ కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుందని ప్రధాని మోడీ ట్రంప్‌కు తెలిపారు. పాక్‌ ఉగ్రవాదం, కశ్మీర్‌ పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్‌కు వివరించారు. ట్రంప్ కూడా సమస్య తీవ్రతను అర్ధం చేసుకున్నారు,” అని చెప్పారు. 

పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యక్రమాలు నిలిపివేస్తే తప్ప చర్చలు ఉండబోవని పదేపదే చెపుతున్న మోడీ సర్కార్, ట్రంప్-మోడీ భేటీ తరువాత ఇప్పుడు పాకిస్థాన్‌తో చర్చలకు వ్యతిరేకం కాదని చెప్పడం చూస్తే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గుతున్నట్లే కనిపిస్తోంది. అదే జరిగితే దౌత్యపరంగా పాక్‌ గెలిచినట్లే భావించవచ్చు. 

అయితే పరస్పరం నమ్మకం, గౌరవం లేని దేశాల మద్య జరిగే ఇటువంటి చర్చల వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమయింది. భారత్‌ పట్ల పాకిస్థాన్‌కున్న విద్వేషం ఎన్నటికీ పోదు. పాక్‌ రాజకీయాలను ఉగ్రవాదాన్ని వేరు చేయలేనంతగా పెనవేసుకుపోయాయి. పాక్‌ ప్రభుత్వంలో ఉగ్రవాదం ఒక భాగమైపోయినందున అందుకు భిన్నంగా భారత్‌-పాక్‌ మద్య ఎటువంటి శాంతి ప్రయత్నాలు జరిగినా ఆదిలోనే వాటికి ఆటంకం కలిగించేందుకు భారత్‌లో ఉగ్రదాడులు జరుగవచ్చు. అప్పుడు మళ్ళీ ఇరుదేశాల మద్య ఉద్రిక్తతలు నెలకొనడం తధ్యం. గత నాలుగు దశాబ్ధాలుగా ఇదే జరుగుతోంది. ఇక ముందు కూడా ఇదే జరుగుతుంది. కనుక భారత్‌-పాక్‌ చర్చలు ఒక నిరర్ధకమైన కార్యక్రమం అనే చెప్పవచ్చు.


Related Post