మూడు పార్టీలకు ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకమే

September 25, 2019


img

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు అధికార తెరాస, కాంగ్రెస్‌, బిజెపి మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమైనవే. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. 

తెరాస: లోక్‌సభ ఎన్నికలలో 16 సీట్లు గెలుచుకోవాలనుకుంటే కాంగ్రెస్‌-3, బిజెపి-4 మొత్తం 7 సీట్లు గెలుచుకున్నాయి. అంతకంటే పెద్ద షాక్ ఏమిటంటే సిఎం కేసీఆర్‌ కుమార్తె కవిత బిజెపి అభ్యర్ధి చేతిలో ఓడిపోవడం. అప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిల జోరు పెరిగిపోయింది. రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారుకు ప్రజావ్యతిరేకత పెరిగిందని వాదించడం మొదలుపెట్టాయి. కనుక మున్సిపల్ ఎన్నికలలో తమ సత్తా చాటుకోవాలని తెరాస భావిస్తే వాటికంటే ముందు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు వచ్చేశాయి. కనుక కాంగ్రెస్‌, బిజెపిల వాదన తప్పని నిరూపించాలంటే ఈ ఎన్నికలలో తెరాస తప్పనిసరిగా గెలవాలి. తెరాస అభ్యర్ధిగా ఎస్. సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు   

బిజెపి: లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఎంపీ సీటు ఎక్కువే గెలుచుకోవడంతో రాష్ట్ర బిజెపి నేతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెరాస సర్కార్‌ పట్ల కేంద్రప్రభుత్వ, బిజెపి అధిష్టానం వైఖరిలో కూడా మార్పువచ్చి రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకోవడానికి అవసరమైన తోడ్పాటు అందిస్తుండటంతో వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రంలో తమ శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు. కనుక రాజకీయ కుటుంబానికి చెందిన శ్రీకళారెడ్డిని బిజెపి అభ్యర్ధిగా ప్రకటించింది.  

కాంగ్రెస్‌: పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి తన భార్య పద్మావతిరెడ్డికి టికెట్ సాధించుకోవడంతో ఆమెను గెలిపించుకోవడం ఆయనకు చాలా ముఖ్యం. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిది. అసెంబ్లీ ఎన్నికలలో తెరాస దానిని బద్దలు కొట్టింది. కనుక జిల్లా కాంగ్రెస్‌ నేతలందరూ ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి పద్మావతీరెడ్డిని గెలిపించుకొని ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్నారు. జిల్లా నేతలే కాక పార్టీలో సీనియర్లందరూ ఆమెకు మద్దతు ప్రకటించి గెలిపించుకుంటామని నమ్మకంగా చెపుతున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని తెరాస, బిజెపిలు చేస్తున్న దుష్ప్రచారం తప్పని నిరూపించాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పద్మావతీ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

ఈవిధంగా వేర్వేరు కారణాలతో మూడు పార్టీలకు ఈ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. కనుక వాటి మద్య పోటీ కూడా చాలా తీవ్రంగానే ఉండబోతోంది. కనుక ఈ ఎన్నికలలో ఓడినపార్టీలకు ఆ తరువాత కొంతకాలంపాటు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోకతప్పదు.


Related Post