రజనీ...కమల్... ఓ ప్రశాంత్ కిషోర్!

September 21, 2019


img

తమిళనాడులో జయలలిత, కరుణానిధి ఉన్నంతవరకు రాష్ట్ర రాజకీయాలను వారివురే శాశించారు. కానీ వారివురి మరణం తరువాత ఏర్పడిన రాజకీయశూన్యతను ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం అన్నాడిఎంకె పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ సిఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాలపై, పార్టీపై చివరికి ప్రభుత్వంపై కూడా ఇంతవరకు పూర్తి పట్టుసాధించలేకపోయారు. కమల్ హాసన్‌ ధైర్యం చేసి మక్కళ్‌ నీతి మయ్యం అనే పార్టీని పెట్టి గట్టిగా ప్రయత్నించినప్పటికీ తమిళనాడు ప్రజలు ఎందుకో ఆయనను ఆదరించలేదు. కనుక ఆయన కూడా ఎన్నికల వ్యూహానిపుణుడు ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. 

జయలలిత పోయిన తరువాత రజనీకాంత్ కూడా ప్రత్యక్షరాజకీయాలలో దిగాలనుకున్నారు కానీ ధైర్యం చేయలేకపోయారు. లోక్‌సభ ఎన్నికలలోనైనా పోటీ చేస్తారనుకుంటే అప్పుడూ ధైర్యం చేయలేకపోయారు. కానీ నానాటికీ అభిమానుల ఒత్తిడి పెరిగిపోతుండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తప్పక పోటీ చేస్తారని ఆయన తరపున ఆయన సన్నిహితులు హామీ ఇచ్చారు. ఇటీవల రజనీకాంత్ కూడా ముంబైలో ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయినట్లు వార్తలు రావడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తప్పకుండా పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 

అయితే ఇప్పటికే కమల్ హాసన్‌ పార్టీని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ ఒప్పందం చేసుకొన్నప్పుడు, రజనీకాంత్ ఆయనను ఎందుకు కలిశారు? కమల్ హాసన్‌ను కాదని ఆయన రజనీకాంత్ కోసం పనిచేస్తారా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఇప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా తెలుసుకునేందుకే రజనీకాంత్ ప్రశాంత్ కిషోర్‌ను కలిసి ఉండవచ్చు. ఒకవేళ అనుకూల పరిస్థితులు లేవని తెలిసినా, ఆశించిన ఫలితాలు రాకపోవచ్చునని ప్రశాంత్ కిషోర్‌ చెప్పినా రజనీకాంత్ రాజకీయ ప్రవేశ ఆలోచనలను మళ్ళీ అటకెక్కించేసినా ఆశ్చర్యం లేదు. 

అదీగాక అక్రమస్తుల కేసులో నాలుగేళ్ళు జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల కాబోతోంది. ఆమె జైలుకు వెళ్ళే ముందు, జయలలిత సమాధిపై మూడుసార్లు గట్టిగా చరిచి, తాను జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత తనకు ఆ దుర్గతి పట్టించిన వారందరిపై ప్రతీకారం తీర్చుకొంటానని శపధం చేశారు. స్వర్గీయ జయలలితకు ఆమె ఏ మాత్రం తీసిపోదు. కనుక  ఆమె మళ్ళీ రీఎంట్రీ ఇస్తే తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోవచ్చు. కనుక రజనీకాంత్ రాజకీయ ప్రవేశం అనుమానమే. 


Related Post