మోడీ, ట్రంప్ ఎవరి లెక్కలు వారివే!

September 24, 2019


img

మొన్న ఆదివారం రాత్రి హ్యూస్టన్‌లో ‘హౌడి మోడీ’ సభ నభూతో నభవిష్యత్ అన్నట్లు జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ కోసం సుమారు 50,000 మందికి పైగా ప్రవాసభారతీయులు తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. మోడీ-ట్రంప్ స్టేడియంలో ప్రవేశించగానే వారు చేసిన హడావుడి చూసి ట్రంప్ సైతం ఆశ్చర్యపోయారు. అమెరికాలో నరేంద్రమోడీకి ఎంత ఫాలోయింగ్ ఉందో ట్రంప్‌కు బాగానే తెలుసు. కానీ దానిని తొలిసారిగా ప్రత్యక్షంగా తన కళ్ళారా చూశారు. 

మోడీ గౌరవార్ధం జరిగిన ఆ సభకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎందుకు తరలివచ్చారు? అనే ప్రశ్నకు ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంలో జవాబు లభించింది. 2020, నవంబర్ 3వ తేదీన జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మళ్ళీ డోనాల్డ్ ట్రంప్ గెలవబోతున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నప్పుడు సభకు వచ్చిన ప్రవాసభారతీయులు చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. అమెరికాలో స్థిరపడిన లక్షలాది ప్రవాసభారతీయుల మద్దతు కూడగట్టుకునేందుకే ట్రంప్ ఈ సభకు హాజరయ్యారని స్పష్టం అవుతోంది. 

ఇక డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడారు? అనే ప్రశ్నకు అనేక సమాధానాలు కనిపిస్తున్నాయి. గ్రీన్ కార్డ్స్, హెచ్-1బీ, హెచ్-4 వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కొత్త కొత్త ఆంక్షలు విధిస్తూ ప్రవాసభారతీయులను, భారతీయ ఐ‌టి కంపెనీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయన భారత్‌కు అనుకూలవైఖరి తీసుకుంటారనే ఆశతో మద్దతు పలికి ఉండవచ్చు. 

ముఖ్యంగా కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయవేదికలపై పాకిస్థాన్‌ చేస్తున్న హడావుడిని కట్టడి చేయాలంటే అమెరికా మద్దతు చాలా అవసరం. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం తమ తదుపరి లక్ష్యమని మోడీ సర్కార్ ఇటీవలే ప్రకటించింది. కనుక ఒకవేళ రానున్న రోజులలో భారత్‌ అటువంటి ప్రయత్నం చేస్తే అమెరికా అడ్డుపడకుండా ఉండేందుకు, అదేసమయంలో పాకిస్తాన్ అణుబాంబులను ప్రయోగించకుండా కట్టడి చేసేందుకు అమెరికా ఒత్తిడి చాలా అవసరం. కనుక ఇదీ ఓ కారణంగా కనిపిస్తోంది. 

అంతర్జాతీయ సదస్సులలో భారత్‌కు సంబందించిన వివిద అంశాలపై అమెరికా మద్దతు పొందగలిగితే అగ్రరాజ్యాలన్నీ భారత్‌కు మద్దతు పలుకుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు మద్దతు ప్రకటించినట్లయితే అమెరికా-భారత్‌ మద్య చిన్నగా మొదలైన వాణిజ్యయుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చునని ప్రధాని నరేంద్రమోడీ ఆశపడుతుండవచ్చు. ట్రంప్‌కు మద్దతుగా మోడీ మాట్లాడటానికి ఇంకా అనేక కారణాలు ఉండవచ్చు. అయితే ట్రంప్ 5 ఏళ్ళ పాలనను స్వయంగా చూసిన ప్రవాసభారతీయులు ఆయనను మళ్ళీ ఎన్నుకొంటే తమకు లాభామా నష్టామా? అని వారే ఆలోచించుకోవాలి.


Related Post