ఉగ్రవాదులను మేమే తయారుచేశాం: ఇమ్రాన్ ఖాన్‌

September 24, 2019


img

కశ్మీర్‌ అంశంలో భారత్‌ను ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న పాకిస్థాన్‌ పదేపదే నవ్వులపాలవుతోంది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఉగ్రవాదులకు తమ నిఘా సంస్థ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో చేతులు కలపడం ఒక తప్పుడు నిర్ణయమని వివరించే ప్రయత్నంలో ఇన్నాళ్లుగా దాచిపెట్టిన ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు.అదీ...అమెరికాలో! 

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఉగ్రవాదం కారణంగా మా దేశం 70,000 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మా ఆర్ధిక వ్యవస్థపై కూడా ఉగ్రవాదం తీవ్ర ప్రభావం చూపింది. అసలు ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో చేతులు కలపాలనే మా గత పాలకుల నిర్ణయమే చాలా తప్పు అని భావిస్తున్నాను. ఒకప్పుడు అంటే 1980లో ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ రష్యా దురాక్రమణ చేసినప్పుడు, దానిని అడ్డుకునేందుకు అమెరికా మా సాయం కోరింది. రష్యా సేనలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను ఏకం చేసి పోరాటానికి సిద్దం చేసేందుకు అప్పుడు మేము ప్రయత్నించాము. ఆ పోరాటంలో పాల్గొనేవారికి మా నిఘా సంస్థ ఐఎస్ఐ ద్వారా అవసరమైన యుద్ధశిక్షణ ఇచ్చాము. 1989లో సోవియట్ సేనలు ఆఫ్ఘనిస్తాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయాక మేము శిక్షణ ఇచ్చిన ఆ జిహాదీలే మాదేశంలో బలీయమైనశక్తిగా అవతరించారు. 


9/11 ట్విన్ టవర్స్ దాడి తరువాత అమెరికా మొదలుపెట్టిన ఉగ్రవాదంపై పోరాటంలో మేము ఆ జిహదీలతోనే పోరాడవలసివస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సేనలు కూడా ఆ జిహాదీలతోనే పోరాడవలసివస్తోంది. ఈ పరిణామాలన్నీ చూసినట్లయితే గతపాలకులు చారిత్రిక తప్పులు చేసినట్లు అర్ధం అవుతోంది. ఇప్పుడు పాకిస్థాన్‌ దానికి మూల్యం చెల్లిస్తోంది,” అని అన్నారు. 

దీంతో పాక్‌ ఉగ్రవాదం గురించి భారత్‌ చేస్తున్న వాదనలను పాక్‌ ప్రదాని ఇమ్రాన్ ఖాన్‌ స్వయంగా దృవీకరించినట్లయింది.ఉగ్రవాదులను సృష్టించడంలో అమెరికా హస్తం కూడా ఉందని స్పష్టం అయ్యింది. అమెరికా కూడా దానికి భారీగానే మూల్యం చెల్లిస్తోంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంటే, ఐఎస్ఐ సంస్థ వారికి ఆయుధాలు, శిక్షణ ఇస్తోందని స్పష్టం అయ్యింది. కనుక భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్‌ పాలకుల, సైన్యాధికారుల, ఐఎస్ఐ హస్తం ఉందనే విషయం కూడా స్పష్టమయింది. కనుక ఇకపై భారత్‌ ఎదురుదాడి చేస్తే పాకిస్థాన్‌ ప్రపంచదేశాల మద్దతు పొందడం కూడా కష్టమే కావచ్చు. 


Related Post