బిజెపికి వరంగా మారుతున్న పాక్‌ బలహీనత

September 23, 2019


img

పిల్లికి చెలగాటం.. ఎలక్కి ప్రాణ సంకటం...ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది...అనే మాటలు ఇప్పుడు పాకిస్థాన్‌కు అక్షరాల సరిపోతాయని చెప్పవచ్చు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయాలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయవేదికలపై నవ్వులపాలైంది. అయినప్పటికీ, భారత్‌తో అణుయుద్ధం చేస్తామంటూ పాక్‌ పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోపక్క భారత్‌పైకి ఉగ్రవాదులను పంపించి దాడులు చేయించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పాక్‌ చేస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొడుతూనే భారత ప్రభుత్వం పలుమార్లు పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయినా పాక్‌ తీరులో ఏమాత్రం మార్పు కనబడటం లేదు. అందుకు చాలా బలమైన కారనాలే కనిపిస్తున్నాయి. 

భారత్‌ సైనికులు పాక్‌ భూభాగంలో ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు వాటిని పాక్‌ అడ్డుకోలేకపోవడంతో...ఆ విషయం యావత్ ప్రపంచానికి తెలిసినప్పటికీ దాడులు జరుగలేదని చెప్పుకోవలసిరావడం, బందీగా చిక్కిన భారత్‌ నేవీ ఉద్యోగి కులభూషన్ యాదవ్ ఉరిశిక్షను అమలు చేయలేకపోవడం, బాలాకోట్ వాయుసేన దాడులను అడ్డుకోలేకపోవడం, ఎదురుదాడిలో ఎఫ్-16 విమానం కోల్పోవడంతో కక్కలేక మింగలేక పరిస్థితి ఎదుర్కోవలసిరావడం, ఆ విమానాన్ని కూల్చివేసి బందీగా చిక్కిన అభినందన్ వర్ధమాన్ విడిచిపెట్టవలసిరావడం వంటి వరుస పరిణామాలతో పాక్‌ పాలకులు, సైన్యాధికారులు తమ దేశప్రజల ముందు తలదించుకోవలసి వస్తోంది. కనుక వారు తమ పరువు కాపాడుకోవడం కోసం ఈవిధంగా ఏదో ఓ హడావుడి చేస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక తప్పడం లేదు. అంటే వారికీ భారత్‌ను కవ్వించడం తప్పసరి అవుతోందని అర్ధం అవుతోంది. పాక్‌ యొక్క ఈ బలహీనతే నరేంద్రమోడీ ప్రభుత్వానికి, బిజెపికి ఎన్నికలలో ఆయాచితవరంగా లభిస్తోందని చెప్పవచ్చు. దానిని బిజెపి నేతలు సద్వినియోగపరుచుకోవాలనుకోవడం ఆశ్చర్యకరమైన విషయం కాదు.

త్వరలో మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో 64 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక బిజెపి నేతలు, కేంద్రమంత్రులు మళ్ళీ పాకిస్థాన్‌ అంశం ప్రస్తావిస్తూ ప్రజలలో భావోద్వేగాలు రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

మొన్న హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, నిన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాకిస్థాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు పాక్‌ మరొక్కసారి ప్రయత్నిస్తే ప్రపంచపఠంలో పాకిస్థాన్‌ను కనబడకుండా చేస్తామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. 1965,1971లో  చేసిన తప్పులను పాక్‌ మళ్ళీ చేసినట్లయితే ప్రపంచంలో ఏ శక్తి పాకిస్థాన్‌ను కాపాడలేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. కశ్మీర్‌ గురించి మాట్లాడుతున్న పాకిస్థాన్‌ ముందుగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల గురించి సంజాయిషీ ఇవ్వాలని అన్నారు. కశ్మీర్‌ విషయంలో తలదూరిస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు.   

ఆదివారం రాత్రి హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోడీ’ బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోడీ కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సమక్షంలోనే కశ్మీర్‌ అంశం ప్రస్తావించి పాకిస్తాన్‌కు తీవ్రహెచ్చరికలు జారీ చేశారు.    

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు పాకిస్థాన్‌ను ఉద్దేశ్యించే ఈ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారని భావించవచ్చు. అయితే పాకిస్థాన్‌ పాలకులు తమ బలహీనతల కారణంగా వెనక్కు తగ్గలేకపోవడంతో బిజెపికి వరంగా మారుతోంది. కనుక భారత్‌లో ఎన్నికలు పాకిస్థాన్‌కు పిల్లికి చెలగాటం..ఎలక్కి ప్రాణ సంకటం...ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది... అన్నట్లు మారుతున్నాయని చెప్పకతప్పదు.


Related Post