మరో పుల్వామా జరిగితేనే బిజెపి గెలుస్తుంది: శరత్ పవార్

September 21, 2019


img

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ అధినేత శరత్ పవార్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా తరహా మరో ఉగ్రదాడి జరిగితేనే మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుస్తుందని లేకుంటే గెలువలేదని అన్నారు. 

“లోక్‌సభ ఎన్నికలకు ముందు పాక్‌ ప్రేరిత పుల్వామా ఉగ్రదాడి జరుగడంతో, బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై వాయుసేనతో దాడులు చేయించి మోడీ ప్రభుత్వం ఈ ఘటనలను చాలా తెలివిగా ఉపయోగించుకొని దేశప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి విజయం సాధించింది. కానీ ప్రస్తుతం బిజెపి పాలిత మహారాష్ట్రలో ఆ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. గత ఐదేళ్ళలో సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి చేసిందేమీ లేకపోవడంతో రాష్ట్రప్రజలు బిజెపిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక పుల్వామా తరహా మరో ఉగ్రదాడి జరిగితేనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలవగలదు లేకుంటే ఓటమి తధ్యం,” అని అన్నారు. 

పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ, ట్రిపుల్ తలాక్ వంటి నిర్ణయాల కారణంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశప్రజలలో ప్రధాని నరేంద్రమోడీ పట్ల వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అందుకే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 150కి మించి సీట్లు రాకపోవచ్చునని సిఎం కేసీఆర్‌ అంచనా వేశారు. కానీ పుల్వామా దాడి, తదనంతర పరిణామాల గురించి ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ గట్టిగా ప్రచారం చేసుకోవడంతో దేశప్రజలలో భావోద్వేగాలు పెరిగాయి. దాంతో బిజెపి తిరుగులేని మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. బహుశః ఆ ప్రభావం తోడవడంతో తెలంగాణ రాష్ట్రంలో బలం లేకపోయినా బిజెపి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగిందని చెప్పవచ్చు. 

అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు పుల్వామా దాడి జరుగడం ఒక అనూహ్యమైన ఘటనగానే చూడాలి తప్ప దానిని లోక్‌సభ ఎన్నికలతో ముడి పెట్టి చూడటం చాలా తప్పు. అలాగే పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ వాయుసేన బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడాన్ని కూడా లోక్‌సభ ఎన్నికలతో ముడిపెట్టి చూడలేము. అవి దేశసమగ్రత, భద్రతకు సంబందించిన అంశాలుగానే చూడాలి. 

కానీ ఎన్నికలకు ముందు ఒకదాని తరువాత మరొకటిగా వరుసగా జరిగిన ఈ ఘటనలను బిజెపి తెలివిగా ఉపయోగించుకొని ఎన్నికలలో లబ్ది పొందిన మాట వాస్తవం. కానీ అంతమాత్రన్న ప్రతీ ఎన్నికల ముందు అటువంటి ఘటనలు జరుగుతాయని చెప్పడం చాలా దారుణం. అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రాభివృద్ధి, స్థానిక సమస్యలు ప్రధాన అంశాలుగా చేసుకొని పోరాడుకుంటే పరువాలేదు కానీ ఈవిధంగా అవాంఛనీయఘటనలు జరగాలన్నట్లు మాట్లాడటం చాలా దారుణం. ముఖ్యంగా శరత్ పవార్ వంటి సీనియర్ నేత ఈవిధంగా మాట్లాడటం ఇంకా దారుణం.


Related Post