సింగరేణి కార్మికులకు నేడు బోనస్ ప్రకటన?

September 19, 2019


img

సింగరేణి సంస్థకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఏనాడూ బొగ్గు ఉత్పత్తి తగ్గలేదు. వేలాదిమంది సింగరేణి కార్మికులు తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి రేయింబవళ్లు బొగ్గు గనులలో పనిచేస్తునందునే నేడు రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో కూడా ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పనిచేయగలుగుతున్నాయి. కానీ సింగరేణి సరఫరా చేసిన బొగ్గుకు అవి వెంటనే సొమ్ము చెల్లించకపోవడంతో సింగరేణి సంస్థ ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. 

సింగరేణికి తెలంగాణ ట్రాన్స్‌కో రూ.5,000 కోట్లు, జెన్‌కో రూ.2,800 కోట్లు, ఏపీ జెన్‌కో రూ.600 కోట్లు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కలిపి రూ.1,000 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉంది. అంటే సింగరేణి సంస్థ 9,400 కోట్లు విలువ చేసే బొగ్గు ఉత్పత్తి, సరఫరా చేసి లాభాలబాటలోనే నడుస్తున్నట్లే అర్ధమవుతోంది. కానీ ఆ బకాయిలు వసూలు కాకపోవడంతో పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం పొంచి ఉందని సింగరేణి కార్మిక సంఘాల వాదన. అది నిజం కూడా. 

ఈ బకాయిలను కూడా పరిగణనలోకి తీసుకొని సింగరేణి సంస్థ 2018-19 సం.లలో 1,766 కోట్లు లాభాలు ఆర్జించినట్లు ప్రకటించింది. గత ఏడాది లాభాలలో 27శాతం  వాటాను కార్మికులకు బోనస్‌గా ఇచ్చినందున, ఈసారి అంతకనే ఎక్కువ లాభాలే వచ్చాయి కనుక మరో రెండు మూడు శాతం అదనంగా బోనస్ వస్తుందని కార్మికులు అందరూ ఎదురు చూస్తున్నారు. దసరా, దీపావళి పండుగలకు బోనస్ చేతికి అందుతుంటుంది కనుక సింగరేణి కార్మికులు అందరూ ప్రభుత్వ ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 

ఈ బకాయిలు, బోనస్, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఎం కేసీఆర్‌ బుదవారం శాసనసభలో తన ఛాంబర్‌లో సింగరేణి ఛైర్మన్ శ్రీధర్, తెరాస ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి చర్చించారు. కార్మికులకు ఈయవలసిన బోనస్‌పై గురువారం శాసనసభలో ప్రకటన చేస్తానని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కనుక ఈరోజు సింగరేణి కార్మికులకు శుభవార్త వినే అవకాశం ఉందని భావించవచ్చు. 

ఒక సంస్థను ఏర్పాటు చేయడం ఎంత కష్టమో దానిని సమర్ధంగా నిర్వహిస్తూ లాభాలబాటలో నడిపించడం ఇంకా కష్టం. కనుక లాభాలబాటలో నడుస్తున్న సింగరేణి సంస్థను, దానిపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది కార్మిక కుటుంబాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.


Related Post