కాంగ్రెస్‌లో ఉండడు...బిజెపిలో చేరడు

September 19, 2019


img

సుమారు మూడు నెలల క్రితం బిజెపిలో చేరబోతున్నానని ప్రకటించిన మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేటికీ చేరలేదు. కనుక ‘టెక్నికల్‌గా తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నట్లు లెక్క’ అని ఆయనే చెప్పుకున్నారు. ఏదోవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నారు కనుక పోనీ పార్టీ కోసం పనిచేస్తారా… అంటే చేయరు. వీలుచిక్కినప్పుడల్లా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, భట్టి తదితరుల వలననే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి దాపురించిందంటూ ఏవో విమర్శలు చేస్తుంటారు. పార్టీలో ఉంటూ పార్టీ ప్రతిష్టకి భంగం, పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించేవిధంగా వ్యవహరిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుంది. ఆయనను బయటకు పంపిస్తే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా వెళ్ళిపోతారనే భయమో లేదా ఈ పరిస్థితులలో మరో ఎమ్మెల్యేను కోల్పోవడం ఎందుకనే ఆలోచనతోనో చర్యలు తీసుకోవడం లేదు. 

టి-కాంగ్రెస్‌ యొక్క ఈ బలహీనతను రాజగోపాల్ రెడ్డి కూడా గుర్తించినందునే నిర్భయంగా పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారనుకోవచ్చు. ఆయన శాసనసభ ఆవరణలో విలేఖరులతో చిట్ చాట్ చేస్తూ, “కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ షిప్ వంటిది. తెలంగాణలో దాని పనైపోయింది. రాష్ట్రంలో తెరాసను ఎదుర్కొని నిలబడగలిగేది బిజెపి మాత్రమే. బిజెపిలో చేరాలనుకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరుతాను,” అని అన్నారు. 

దాదాపు మూడు నెలల నుంచి రాజగోపాల్ రెడ్డి ఇదే మాట చెపుతున్నారు కానీ బిజెపిలో చేరడం లేదు. ఎందుకు చేరడం లేదో చెప్పడం లేదు. 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేటికీ కోమటిరెడ్డి సోదరులను నెత్తిన పెట్టుకుంటోందే తప్ప వారికి ఏ అపకారమూ చేయలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు...లేనప్పుడు కూడా కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టి పదవులు తీసుకున్నారు. కాని పార్టీ పరిస్థితులు తారుమారుకాగానే మునిగిపోతున్న టైటానిక్ షిప్‌పైనే నిలబడి రాజగోపాల్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం శోచనీయం. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే పార్టీని విమర్శిస్తుండటం, ఆయనను సోదరుడు వెంకట్‌రెడ్డితో సహా పార్టీలో ఎవరూ వారించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగదలచుకోకపోతే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుందాగా వెళ్లిపోవాలి కానీ సమాజంలో తనకు ఇంత గుర్తింపు, గౌరవం ఇచ్చిన పార్టీని అకారణంగా నిందించడం సరికాదనే చెప్పాలి.


Related Post