భారత్‌-పాక్‌ యుద్ధం జరిగితే నష్టపోయేది ఎవరు?

September 18, 2019


img

ఒకవేళ భారత్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగి ప్రాణనష్టం జరిగితే అది ప్రత్యక్ష యుద్ధానికే దారితీస్తుందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ స్వయంగా చెప్పారు. దాని పర్యవసనాలు తెలిసి కూడా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించి విధ్వంసం సృష్టించేందుకు పాక్‌ విఫలయత్నాలు చేస్తోందంటే భారత్‌తో ‘అంతిమ యుద్ధానికి’ పాక్‌ ఎంతగా తహతహలాడుతోందో అర్ధం చేసుకోవచ్చు. భారత్‌తో యుద్ధంలో గెలవలేమని చెప్పుకొంటూనే యుద్ధం జరిగితే అది భారత్‌-పాక్‌లకే పరిమితం కాదని ప్రపంచదేశాలకు వ్యాపిస్తుందంటూ బ్లాక్ మెయిల్ చేసేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. 

అయితే భారత్‌తో యుద్ధం చేస్తే తాము తుడిచిపెట్టుకుపోతామని తెలిసి కూడా పాక్‌ పాలకులు ఎందుకు యుద్ధం కోసం అంతా తహతహలాడుతున్నారంటే, కశ్మీర్‌ విషయంలో అనవసరంగా తలదూర్చి ఇప్పుడు దాని నుంచి బయటపడే మార్గంలేక...మోడీ ప్రభుత్వం దూకుడును తట్టుకోలేక...భారత్‌ను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక... పాక్‌ పాలకులు, సైన్యాధికారులు తమ దేశప్రజల ముందు, ప్రతిపక్షాల ముందు తలదించుకోవలసివస్తోంది. అందుకే పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కశ్మీర్‌కు స్వాతంత్ర్యం సాధించేందుకు భారత్‌తో అణుయుద్ధానికైనా సిద్దమంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.

 అయితే భారత్‌-పాక్‌ యుద్ధం జరిగితే ఎవరు నష్టపోతారు? అంటే మేమేనాని పాక్‌ పాలకులే చెప్పుకొంటున్నారు. కానీ   ఇప్పటికే నిరుద్యోగం, దారిద్ర్యం, ఉగ్రవాదం, ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ఈ యుద్ధంతో కొత్తగా నష్టపోయేదేమీ ఉండదు కానీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంటే “మేము నాశనం అయిపోయినా పరువాలేదు కానీ భారత్‌ కూడా నష్టపోతే అదే మాకు చాలా సంతోషం,’ అన్నట్లుంది పాక్‌ తీరు. కనుక ఈ ఉద్రిక్తతలను ఇంకా కొనసాగనీయకుండా తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం మంచిది.


Related Post