అమిత్ షా ఉద్దేశ్యం ఏమిటో?

September 18, 2019


img

కేంద్రహోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశరాజకీయ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “మనకు స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలైంది. అప్పటి నుంచి 2014 వరకు మన ప్రజాస్వామ్య వ్యవస్థను చూసినట్లయితే అది విఫలమైనట్లు కనిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి దేశప్రజలు ఏకపక్షంగా తీర్పు వెలువరించడం గమనిస్తే, మన దేశంలో బహుళపార్టీల రాజకీయ వ్యవస్థపై వారు కూడా నమ్మకం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో దృడమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకొంటున్నట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దేశప్రజలు కోరుకొంటున్నట్లుగానే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. దశాబ్ధాల కాలంలో తీసుకోలేని నిర్ణయాలను, చేయలేని అనేకపనులను 5 ఏళ్ళలోనే మా ప్రభుత్వం చేసి చూపిస్తోంది,” అని అన్నారు.

కేంద్రహోంమంత్రిగా ఉన్న అమిత్ షా మన ప్రజాస్వామ్యవ్యవస్థ విఫలమైందని, దేశానికి పనికిరాదన్నట్లు మాట్లాడటం చాలా శోచనీయం. నేటికీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది కనుకనే బిజెపి అధికారంలోకి రాగలిగింది. ఒకవేళ అంతకు ముందు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇదేవిధంగా ఆలోచించి ఉండి ఉంటే, బిజెపి ఎన్నటికీ అధికారంలోకి రాగలిగేది కాదు.

బహుళ పార్టీల వ్యవస్థ పనికిరాదని బిజెపి భావిస్తునట్లయితే, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలి. కానీ నేటికీ ఎన్నికలోచ్చిన ప్రతీసారి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొంటూనే ఉండి. ఎన్డీయేను కొనసాగిస్తూనే ఉంది. ఈసారి బిజెపికి లోక్‌సభలో పూర్తి మెజారిటీ లభించింది కనుక అమిత్ షా ఈమాట అనగలుగుతున్నారు లేకుంటే అనగలిగేవారా? అని ఆలోచిస్తే కాదనే సమాధానం వస్తుంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు తామే శాస్వితంగా అధికారంలో ఉండిపోవాలని కోరుకొంటున్నాయి. తద్వారా అవి ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి మళ్ళీ రాజరిక వ్యవస్థవైపు అడుగులు వేస్తున్నట్లు అర్ధం అవుతోంది. అధికార, రాజ్య కాంక్షతో ఒకప్పుడు రాజ్యాల కోసం రాజులు యుద్ధాలు చేసినట్లుగానే, ఇప్పుడు రాజకీయపార్టీలు అధికారం సంపాదించుకోవడం కోసం, దానిని నిలుపుకొని సుస్థిరం చేసుకొని విస్తరించుకోవడం కోసం ఫిరాయింపులు, ఈవీఎంల మేనేజిమెంట్, పోలీసు స్టేషన్‌కు తరలించారు. మేనేజిమెంట్, ప్రతీకార రాజకీయాలతో శత్రువులను తుద ముట్టించేందుకు యుద్ధాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తమ ఆ అధికారకాంక్షకు అవి రకరకాల కారణాలు, పేర్లు పెట్టుకొంటున్నాయి.

అయితే అదృష్టవశాత్తు నేటికీ మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా బలంగానే ఉంది కనుక అధికారంలో ఉన్న మన రాజకీయ పార్టీలు అయిష్టంగానైనా 5 ఏళ్ళకోసారి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగకతప్పడం లేదు.

కానీ రాజరిక వ్యవస్థను నెలకొల్పాలని ఆలోచనలతో పాలకులు ఉన్నందున వారు తమకున్న అధికారాన్ని వినియోగించి ఆ ఆలోచనలను మెల్లగా ఆచరణలో పెట్టాలని ప్రయత్నించవచ్చు. కనుక దేశప్రజలే మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవలసి ఉంటుంది. లేకుంటే మళ్ళీ రాజరిక వ్యవస్థలను, వంశపారంపర్య నియంతృత్వ పోకడలను భరించడానికి సిద్దపడాల్సి ఉంటుంది.


Related Post