గవర్నర్‌ తమిళిసై రూట్ ఎటో?

September 17, 2019


img

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మంగళవారం కలిసి తెరాస సర్కార్‌పై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను రాజకీయంగా బలహీనపరిచి దెబ్బ తీసేందుకు సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని తెరాసలో చేర్చుకోవడమే కాకుండా వారికి మంత్రిపదవులు కూడా ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకున్నారని వారు ఆరోపించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింప జేసుకోవడం, వారి చేత రాజీనామాలు చేయించకుండా కొనసాగించడం, వారికి మంత్రిపదవులు ఇవ్వడం రాజ్యాంగం, ప్రజాస్వామ్య విరుద్దమని వారు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గవర్నర్‌కు ఉంది కనుక తగిన చర్య తీసుకోవలసిందిగా వారు ఆమెను కోరారు.

తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టక మునుపు తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా చురుకైన పాత్ర పోషించారు. కనుక తెలంగాణ గవర్నర్‌గా వచ్చినప్పుడు ఆమె రాష్ట్రంలో బిజెపికి అనుకూలంగా, తెరాస సర్కార్‌కు ప్రతికూలంగా వ్యవహరిస్తారని భావించడం సహజం. కానీ ఆమె గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే సిఎం కేసీఆర్‌ సూచించినట్లు తెరాసలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేత మంత్రిగా స్వయంగా ప్రమాణస్వీకారం చేయించారు. 

అనంతరం తెలంగాణ ప్రజలను ఉద్దేశ్యించి దూరదర్శన్ ద్వారా చేసిన తొలి ప్రసంగంలో కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు అద్భుతంగా ఉన్నాయని, ఇదంతా ఒక్క వ్యక్తి (కేసీఆర్‌) వలననే సాధ్యమైందంటూ కేసీఆర్‌పై ప్రశంశల వర్షం కురిపించారు. కనుక ఆమె స్వయంగా ప్రమాణస్వీకారం చేయించిన సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన పిర్యాదును చెత్తబుట్టలో పడేసి మాజీ గవర్నర్‌ నరసింహన్ బాటలోనే ముందుకు సాగుతారా? లేక కాంగ్రెస్‌, బిజెపి, ఇతర పార్టీలు, సంస్థలు ఇస్తున్న పిర్యాదుల ఆధారంగా తెరాస సర్కార్‌కు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తారా? అనేది రానున్న రోజులలో తెలియవచ్చు.


Related Post