విమర్శలతో విమోచన దినోత్సవం

September 17, 2019


img

ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రధానపార్టీలు తమ కార్యాలయాలలో మువ్వన్నెల జెండాలను ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకున్నాయి. ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ ప్రజల పోరాటాలను స్మరించుకున్నారు. ఆ తరువాత షరా మామూలుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపనందుకు తెరాస సర్కార్‌ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించగా, విమోచన దినోత్సవం పేరుతో బిజెపి మత రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మువ్వన్నెల జెండా ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను ఒకసారి స్మరించుకొని ముందుకు సాగుదామని అన్నారు. బిజెపి విమర్శలపై కేటీఆర్‌ స్పందించలేదు. 

తెరాస సర్కార్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపకపోవడానికి మూడు రోజుల క్రితమే సిఎం కేసీఆర్‌ కారణం చెప్పారు. అధికారికంగా జరుపడం వలన మానిన గాయాలను మళ్ళీ రేపినట్లవుతుందని, ప్రజల మద్య విభేధాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందని కొందరు పెద్దల సలహాలను సూచనలను పాటించి జరపడంలేదని సిఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ మజ్లీస్ అధినేతలు ఓవైసీ సోదరుల మెప్పుకోసమే చేయడం లేదని బిజెపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రక ఘటనకు మతం రంగు పూసి బిజెపి రాజకీయలబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.


Related Post