తెరాస సర్కార్‌కు హైకోర్టు షాక్

September 16, 2019


img

తెరాస సర్కార్‌కు హైకోర్టు ఈరోజు షాక్ ఇచ్చింది. చారిత్రిక ప్రాధాన్యత ఉన్న ఎర్రమంజిల్ భవనాలను కూల్చి వేసి వాటి స్థానంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలనే తెరాస సర్కార్‌ ప్రతిపాదనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడమేకాకుండా నిర్ద్వందంగా తిరస్కరించింది. ఎర్రమంజిల్ భవనాలను కూల్చవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే సిఎం కేసీఆర్‌ వెనకడుగువేసే వ్యక్తికాదు కనుక హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. 

సచివాలయం కూల్చివేయాలనే తెరాస సర్కార్‌ నిర్ణయాన్ని కూడా సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇంకా హైకోర్టు విచారణ జరుగుతోంది. తుదితీర్పు వెలువడేవరకు సచివాలయం కూల్చివేయరాదని హైకోర్టు ఇప్పటికే మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కనుక సచివాలయం కూల్చివేయడానికి ముందుగా హైకోర్టును ఒప్పించవలసి ఉంటుంది. బహుశః అందుకే ముందుజాగ్రత్త చర్యగా తెరాస సర్కార్‌ మంత్రుల సబ్ కమిటీ వేసి నివేదికను తయారు చేయించినట్లు భావించవచ్చు. దసరా పండుగ తరువాత సచివాలయం కూల్చివేత పనులు మొదలుపెట్టాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు హైకోర్టు అంగీకరిస్తుందో లేదో తెలియదు కానీ సచివాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి డిజైన్లు ఆహ్వానించగా 9 సంస్థలు డిజైన్లు సమర్పించినట్లు సమాచారం. వాటినన్నిటినీ సిఎం కేసీఆర్‌ పరిశీలించిన తరువాత వాటిలో ఒకదానిని ఎంపిక చేయగానే కొత్త సచివాలయం నిర్మాణపనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కానీ అన్నిటి కంటే ముందుగా హైకోర్టు నుంచి ఈవిధంగా అభ్యంతరం లేకుండా చూసుకోవలసి ఉంటుంది.


Related Post