కేసీఆర్‌ అసందర్భ ప్రకటన అందుకే: విజయశాంతి

September 16, 2019


img

సిఎం కేసీఆర్‌ శాసనసభలో మాట్లాడుతూ మరో రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పడంపై కాంగ్రెస్‌ మహిళా నేత విజయశాంతి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెరాసలో నానాటికీ పెరుతున్న అసమ్మతిని, అసంతృప్తిని కట్టడి చేయడానికి, హరీష్ రావును తృప్తి పరచడానికే సిఎం కేసీఆర్‌ ఈ అసందర్భ ప్రకటన చేశారని విజయశాంతి అన్నారు.

వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలలో ఏదీ పూర్తి మెజార్టీ సాధించలేకపోతే, జాతీయరాజకీయాలలోకి వెళ్ళి ఫెడరల్ ఫ్రంట్‌ ద్వారా సిఎం కేసీఆర్‌ చక్రం తిప్పాలనుకున్నారు. కానీ ఆయన అంచనాలకు భిన్నంగా కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి తిరుగులేని మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కనుక ఆయన రాష్ట్రానికే పరిమితం కావలసి వచ్చింది. లేకుంటే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యుండేవారేనేమో?

కానీ తెరాస రెండవసారి అధికారం చేపట్టి సుమారు 9 నెలలు పూర్తవుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ చేయకుండా సిఎం కేసీఆర్‌ జాప్యం చేస్తుండటంతో, మంత్రిపదవులు ఆశిస్తున్నవారి సంఖ్య...దాంతో వారి మద్య పోటీ... రాజకీయాలు కూడా పెరిగిపోయాయి. ఆ క్రమంలోనే ఈటల రాజేందర్‌ను మంత్రిపదవిలో నుంచి తప్పిస్తారని, హరీష్ రావుకు మంత్రిపదవి లభించకపోవచ్చునని చాలా జోరుగా ఊహాగానాలు వినిపించాయి. దాంతో సహజంగానే తెరాస నేతలలో అసంతృప్తి, అసహనం, అనుమానాలు, అపోహలు పెరిగిపోయాయి. ఆ కారణంగా తెరాసలో అసంతృప్తి ఏర్పడి పార్టీలో చీలిక ఏర్పడే ప్రమాదం కూడా కనబడింది. బహుశః ఆ ఒత్తిడి పెరిగిపోవడంతోనే సిఎం కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణకు పూనుకొని ఉండవచ్చు లేదా దసరా వరకు ఆగి ఉండేవారేమో అనే వాదన వినిపిస్తోంది.

అయితే మంత్రివర్గ  విస్తరణ చేసిన తరువాత కూడా మంత్రిపదవులు ఆశించి భంగపడినవారి వలన పార్టీలో మళ్ళీ అసంతృప్తి ఏర్పడింది. మరోపక్క వారిని ఆకర్షించేందుకు బిజెపి నేతలు తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక పార్టీలో నెలకొనున్న ఈ అయోమయ పరిస్థితులను తొలగించేందుకే సిఎం కేసీఆర్‌ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ప్రకటించి ఉండవచ్చు. అలాగే రాష్ట్రంలో బిజెపి బలపడుతున్న నేపధ్యంలో తెరాస తన నాయకత్వలోనే పనిచేయబోతోందనే బలమైన సంకేతాలు బిజెపికి, రాష్ట్ర ప్రజలకు పంపించడం ద్వారా పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి అనిశ్చిత వాతావరణం లేదని సిఎం కేసీఆర్‌ గట్టిగా నొక్కి చెప్పే ప్రయత్నం చేసినట్లు భావించవచ్చు.

అయినా రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తునప్పుడు, పార్టీలో అసమ్మతిరాగాలు వినిపిస్తున్నప్పుడు సిఎం కేసీఆర్‌ తప్పుకొని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారనుకోలేము. పార్టీలో, ప్రభుత్వంలో, రాష్ట్ర రాజకీయాలలో తెరాసకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నప్పుడే కేసీఆర్‌ అటువంటి ప్రయత్నం చేయవచ్చు. కనుక కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారని వినిపించే ఊహాగానాలను కేవలం ఊహాగానాలుగానే భావించవచ్చు. 


Related Post