మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య!

September 16, 2019


img

ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆయనను కుటుంబసభ్యులు వెంటనే నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు కానీ ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. 

ఏపీలో టిడిపి ఓడిపోయిన తరువాత జగన్ ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన కోట్లు విలువచేసే అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన ఇంటికి తరలించుకుపోయినందుకు ఏపీ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ఆ ఫర్నీచరును ప్రభుత్వానికి తిరిగి అప్పగించేందుకు లేదా వాటి విలువకు తగ్గ సొమ్ము చెల్లించేందుకు ఆయన సిద్దపడినప్పటికీ పోలీసులు అంగీకరించకుండా కేసులు నమోదు చేయడంతో కోడెల తీవ్ర మనస్తాపం చెందారు. అప్పుడే కోడెల ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఆ తరువాత ఆయనకు గుండెపోటు వచ్చింది. రాజకీయంగా ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగిన ఆయన, ఈ రాజకీయ కక్ష సాధింపులు ఈ అవినీతి ఆరోపణల కారణంగా సమాజంలో తలదించుకోవలసిరావడంతో ఈ అవమానాలు భరించలేకనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని టిడిపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

కోడెల శివప్రసాదరావు వృత్తి రీత్యా వైద్యులు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1983లో టిడిపిలో చేరారు. ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబునాయుడు హయాంలో అనేక కీలక మంత్రిపదవులు సమర్ధంగా నిర్వహించారు. చివరిసారిగా గత టిడిపి హయాంలో ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. 

కోడెల మృతి పట్ల చంద్రబాబునాయుడు, ఏపీ, తెలంగాణ టిడిపి నేతలు, తెలంగాణ సిఎం కేసీఆర్‌ తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోడెలకు భార్య శశికళ, విజయలక్ష్మి అనే ఒక కుమార్తె, శివరామకృష్ణ, సత్యన్నారాయణ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 


Related Post