భారత్‌కు ఉగ్రవాది మసూద్ తొలి హెచ్చరిక?

September 16, 2019


img

కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి, ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి భారత్‌పై తీవ్ర పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ పాలకులు, కొన్ని రోజుల క్రితమే పాక్‌ జైలులో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్‌ను రహస్యంగా విడిచిపెట్టింది. భారత్‌లో ఉగ్రదాడులు జరుపడం కోసమే అతనిని విడిచిపెట్టి ఉండవచ్చని భారత్‌ నిఘావర్గాలు అనుమానం నిజం చేస్తూ హర్యానాలోని రోహతక్ రైల్వేపోలీసులకు అతని సంతకంతో ఒక బెదిరింపు లేఖ అందింది.

హిందీలో వ్రాయబడిన ఆ లేఖలో హర్యానాలోని రేవారి రైల్వే జంక్షన్‌తో సహా దేశంలోని పలు దేవాలయాలను పేల్చివేస్తామని హెచ్చరిక ఉంది. ఆ లేఖ సాధారణపోస్టులో అందడంతో దేశంలోని ఉగ్రవాదుల సానుభూతిపరులు మసూద్  పేరిట అది వ్రాసి ఉండవచ్చని నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ లేఖను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ బెదిరింపు లేఖ నేపధ్యంలో రేవారి రైల్వే జంక్షన్‌తో పాటు హర్యానాలో అన్ని దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రాంతాలలో నిఘా పెంచారు. 

ఈ బెదిరింపు లేఖ నేపధ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నేడు డిల్లీలో అత్యవసర సమావేశం జరుగుతోంది. దీనిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోభల్, కేంద్రహోంశాఖ కార్యదర్శి ఏకే భల్లా, హోం, నిఘా శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.



Related Post