ఆర్మీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

September 12, 2019


img

భారత్‌ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ మొదటి నుంచి కాస్త దూకుడుగానే వ్యవహరిస్తుంటారనే పేరుంది. అందుకు తగ్గట్లుగానే గురువారం సంచలన ప్రకటన చేశారు. శ్రీనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం ఆదేశిస్తే తక్షణం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి దానిని స్వాధీనంలో తెచ్చ్హుకోవడానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. ప్రభుత్వం ఆదేశం కోసం ఎదురుచూస్తున్నాము. రాగానే ఆపరేషన్ మొదలుపెడతాము. ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంటే మేము దానిని అమలుచేస్తాము,” అని అన్నారు.  

కేంద్రప్రభుత్వం ఇటీవల కశ్మీర్‌కు సంబందించి పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మా తదుపరి లక్ష్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకొని మళ్ళీ అఖండ భారత్‌ను ఏర్పాటుచేయడమే,” అని అన్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఎప్పుడు ఏవిధంగా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసునని అన్నారు. కేంద్రమంత్రులు ఈవిధంగా మాట్లాడుతున్నారు కనుకనే భారత్‌ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ కూడా ఈవిధంగా మాట్లాడుతున్నారనుకోవచ్చు. అయితే ఇప్పటికే భారత్‌పై ప్రతీకరేచ్చతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ను ఇటువంటి మాటలు ఇంకా రెచ్చగొట్టినట్లవుతాయనే సంగతి వారికి తెలియదనుకోలేము. కనుక కేంద్రప్రభుత్వం పాక్‌తో నిజంగానే ప్రత్యక్ష యుద్ధం చేయాలనుకొంటే అది నిప్పుతో చెలగాటమేనని చెప్పక తప్పదు. లేక ఈవిధంగా మాట్లాడుతూ ప్రపంచదేశాలపై మరింత ఒత్తిడి పెంచి వాటి చేతే పాకిస్థాన్‌ను కట్టడి చేయించాలనుకొంటే అందుకు ప్రపంచదేశాలు భారత్‌కు ఎల్లకాలం వంతపాడుతాయనుకోవడం అత్యాశే అవుతుంది. కనుక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో భారత్‌ ప్రభుత్వం సంయమనం పాటించడం మంచిది. 


Related Post