కేసీఆర్‌ కుటుంబానికి అందుకే పదవులు: దానం కామెంట్స్

September 11, 2019


img

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనేక కొత్త అంశాలను తెరపైకి తీసుకువస్తుండటం విశేషం. మొదట ‘గులాబీ జెండా ఓనర్షిప్’ అంశం తెరపైకి వచ్చింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ తెరాసలో వారసత్వ హక్కులపై చర్చకు బీజం వేశారు. మంత్రిపదవి దక్కకపోవడంపై స్పందిస్తూ, “నాకు మంత్రిపదవి దక్కనందుకు అసంతృప్తిగా లేను. సమయం వచ్చినప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయి. 18 మందికి మాత్రమే అవకాశమున్న మంత్రివర్గంలో పదవుల కేటాయింపులకు అనేక లెక్కలు ఉంటాయి. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు కనుకనే వారికి మంత్రి పదవులు లభించాయి. కనుక పదవులన్నీ వాళ్ళే తీసుకున్నారనడం సరికాదు,” అని అన్నారు.      

తెరాసలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి తప్ప తెరాసలో ఎవరూ ఆ మాటనలేరు. కానీ దానం నాగేందర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు, కవిత నలుగురు ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు కనుకనే వారు పదవులు పొందడం న్యాయమేనన్నట్లు ఆయన మాట్లాడారు. ఒకవేళ దానం నాగేందర్ చెప్పినట్లు, ఉద్యమంలో పనిచేయడమే మంత్రిపదవులకు అర్హత అయితే ఆ అర్హత ఉన్నవారు తెరాసలో చాలా మందే ఉన్నారు. కానీ వారికి బదులు ఆ అర్హత లేనివారికే తెరాస సర్కార్‌లో పదవులు దక్కుతున్నాయి. అందుకే ‘గులాబీ జెండా ఓనరిషిప్...కిరాయిదారుల’ ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే అర్హత అనుకుంటే దానం నాగేందర్ మంత్రిపదవికి అనర్హుడవుతారు. ఎందుకంటే ఆయన ఉద్యమాలలో పెద్దగా పాల్గొన దాఖలాలు లేవు.


Related Post