గులాబీ ఓనర్షిప్ చర్చ ఇంకా దేనికో?

September 11, 2019


img

మంత్రి ఈటల రాజేందర్‌ రగిల్చిన ‘గులాబీ జెండా ఓనర్ల’ అగ్గిని చల్లర్చే బదులు తెరాస నేతలే ఆ వేడి చల్లారిపోకుండా ఉండేలా మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. గులాబీ జెండా ఓనర్షిప్ వ్యవహారం ముగిసిపోయిందనుకుంటే బుదవారం తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ, “తెరాసకు కేసీఆర్‌ మాత్రమే ఓనర్. మిగిలిన వారందరూ పార్టనర్లు మాత్రమే. ఒకవేళ ఎవరైనా మేమే ఓనర్ అని అనుకుంటే అది అవివేకమే. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళు మోసినవాళ్ళు దాని ఓనర్లు కాలేరు. అలాగే మార్క్సిజానికి కారల్ మార్క్స్ మాత్రమే ఓనర్. లెనినిజానికి లెనిన్ ఓనర్. అదేవిధంగా తెరాసకు కేసీఆరే ఓనర్,” అని అన్నారు. 

ప్రతిపక్షాలు కూడా ఈ గులాబీ జెండా ఓనర్షిప్ విషయం విడిచిపెట్టి వేరే అంశాల గురించి మాట్లాడుతుంటే, తెరాస నేతలు మాత్రం ఇంకా ‘గులాబీ జెండా ఓనర్ కేసీఆరే...’అంటూ మాట్లాడుతుండటం చూస్తుంటే వారు ఈటల రాజేందర్‌ వర్గానికి పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారా?తిరుగుబాటు ఆలోచనలు చేస్తే బయటకు వెళ్లగొడతామని హెచ్చరిస్తున్నారా? లేక తెలిసీతెలియకో లేదా యాదృచ్ఛికంగానో  మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.

అయినా ఓనర్షిప్ గురించి మాట్లాడుతున్న మాటలు తెరాసను ఒక రాజకీయ పార్టీగా కాక అదేదో ప్రైవేట్ కంపెనీ లేదా ప్రైవేట్ సంస్థ అనే భావన ప్రజలకు కలిగేలా చేస్తున్నాయని తెరాస నేతలు గ్రహించినట్లు లేదు. ఒకవేళ తెరాస నేతల దృష్టిలో వారి పార్టీ ఒక ‘ప్రైవేట్ ప్రాపర్టీ’ అనుకొంటున్నట్లయితే అది ప్రజాస్వామ్యవిధానాలకు భిన్నమైనదని భావించాల్సి ఉంటుంది. కాదనుకుంటే వారు ఈ చర్చకు ఇకనైనా ముగిస్తే మంచిది. కాదని వారు దీనిని ఇంకా కొనసాగించదలిస్తే ఇది తెరాస అధిష్టానం వ్యూహంలో భాగంగానే జరుగుతున్న చర్చ అని అనుమానించవలసి ఉంటుంది.


Related Post