మెట్రో వెళ్ళలేని చోటికి ఆర్టీసీ బస్సు వెళ్లగలదు కానీ...

September 07, 2019


img

హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున కారణంగా నానాటికీ నగరంలో జనాభా కూడా పెరిగిపోతోంది. అందుకే ఎన్ని ఆటోలు, క్యాబులు, ప్రైవేట్ వాహనాలు, బస్సులు, మెట్రో రైళ్లు తిరుగుతున్నా  అన్ని రద్దీగానే ఉంటున్నాయి. వాటితో రోడ్లన్నీ నిండిపోతూనే ఉన్నాయి. ఇక మెట్రో వచ్చిన తరువాత కూడా ఈ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కలుగకపోవడానికి కారణం జనాభా... వాహనాలు పెరిగిపోవడమే. కనుక నగరంలో ఆర్టీసీ బస్సులన్నీ ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. బస్సులో సీటు దొరికితే అదృష్టమే అనుకునే పరిస్థితి ఉంది. అయినా ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోతూనే ఉండటం విస్మయం కలిగిస్తుంది.  

నగరంలో మెట్రో రైళ్లు చేరుకోలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. కానీ దశాబ్ధాలుగా నడుస్తున్నఆర్టీసీ నానాటికీ నష్టాలలో కూరుకుపోతుంటే, పూర్తిగా రెండేళ్ళు కూడా నిండని మెట్రో రైల్ అప్పుడే లాభాలబాటలో దూసుకుపోతుండటం విశేషం. ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా సేవలు అందిస్తుండటమే మెట్రో విజయానికి కారణమని అర్ధమవుతోంది. కానీ ఆర్టీసీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండటమే దాని నష్టాలకు కారణంగా కనిపిస్తోంది. 

ఉదాహరణకు మెట్రో స్టేషన్లకు 4-5 కిమీ పరిధిలో నివాసం ఉండే ప్రజలు స్టేషన్ చేరుకోవడానికి, మళ్ళీ స్టేషన్ నుంచి ఇళ్లకు చేరుకోవడానికి తగినన్ని బస్సులు లేకపోవడంతో (ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ) చాలా మంది ఆటోలు, ద్విచక్రవాహనాలపైనే స్టేషన్లకు చేరుకొంటున్నారు. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు ఆర్టీసీ అందిపుచ్చుకోలేకపోతోందో తెలియదు. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని ఉపయోగించుకొని లాభాలు కళ్ళజూసేదే కదా?


Related Post