యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ప్రియాంకా వాద్రా?

September 03, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో తూర్పు ఉత్తరప్రదేశ్‌కు ప్రియాంకా వాద్రా ఇన్-ఛార్జ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ప్రియాంకా వాద్రా, రాహుల్ గాంధీ అందుకు పార్టీలో సీనియర్లను నిందించారు. వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వలననే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందిందని వారిరువురూ పార్టీ అంతర్గత సమావేశంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బహుశః ఆ కోపంతోనే రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసి, తమ కుటుంబానికి చెందనివారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని పట్టుబట్టారు. కానీ పార్టీలో ఎవరూ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడానికి సాహసించలేకపోయారు. ఒకవేళ ఎవరైనా సాహసించి ఉంటే వారిని సోనియా, రాహుల్ విధేయులే అడ్డుకొని ఉండవచ్చు. చివరికి మళ్ళీ సోనియా గాంధీకే తాత్కాలికంగా పార్టీ పగ్గాలు అప్పగించి అందరూ చేతులు దులుపుకున్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పుడు ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలనే వాదన వినిపించింది కానీ ఆమె ఎందుకో వెనకడుగు వేశారు. 

కాంగ్రెస్‌ పార్టీ పునర్వైభవం సాధించాలంటే పార్టీకి పుట్టినిల్లు వంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే అది మొదలవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే, దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలోనే అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలున్నాయి. అక్కడ పార్టీని గెలిపించుకోగలిగితే సగం విజయం సాధించినట్లే. కనుక 2022 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రియాంకా వాద్రాను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Related Post