దసరానాటికి మంత్రివర్గ విస్తరణ?

August 28, 2019


img

తెరాస అధికారంలోకి వచ్చి అప్పుడే 8 నెలలు పూర్తికావస్తోంది. కానీ ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. సిఎం కేసీఆర్‌తో కలిసి మొత్తం 12 మంది మంత్రులున్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉంది. కనుక దసరా పండుగలోగా మంత్రివర్గ విస్తరణ చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

తెరాసలో మంత్రిపదవులకు అర్హులు లేదా పోటీ పడుతున్నవారి జాబితా చెంతాడంత ఉంది. కేటీఆర్‌, హరీష్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, గంగుల కమలాకార్, కవిత, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, హరీప్రియనాయక్, దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జోగు రామన్న, నన్నపనేని నరేందర్, పువ్వాడ అజయ్‌కుమార్‌, మాగంటి గోపీనాధ్‌, అరికెపూడి గాంధీ, రేగ కాంతారావు ఇంకా చాలామందే ఉన్నారు. కానీ అందరినీ మంత్రివర్గంలోకి తీసుకోవడం సాధ్యం కాదు కనుక మంత్రివర్గంలో నలుగురు మంత్రులను తప్పించడం ద్వారా 10 మందికి అవకాశం కల్పించి అసంతృప్తిని తగ్గించుకోవచ్చనే ఆలోచనలో సిఎం కేసీఆర్‌ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఏది ఏమైనప్పటికీ దసరానాటికి మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన చేయడం తధ్యమని తెలుస్తోంది. ఒకేసారి ఆరుగురిని మంత్రివర్గంలో తీసుకొంటారా లేదా? ఎంతమందిని తీసుకొంటారు? ఎవరెవరికి అవకాశం లభిస్తుంది? ప్రక్షాళనలో ఎవరెవరిని బయటకు పంపిస్తారు? అనేవి ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ మంత్రివర్గ విస్తరణ అనే తేనెతుట్టెను కేసీఆర్‌ కదిపినట్లు తెలుస్తోంది కనుక మీడియాలో దీనిపై చాలా ఊహాగానాలు మొదలైపోయాయి. 

వాటిలో కేటీఆర్‌, గుత్తా సుఖేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలకు మంత్రివర్గంలో తీసుకోవడం ఖాయమనే ఊహాగానం బలంగా వినిపిస్తోంది. కేటీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకొని కవితను తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ హరీష్ రావును పక్కనపెట్టారనే భావన ప్రజలలో వ్యాపించి ఉంది కనుక ఆయనను మంత్రివర్గంలో తీసుకోకతప్పదని లేకుంటే కీలకపదవి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

కులాలు, ప్రాంతాలు, సీనియారిటీ, విధేయత, ఒత్తిళ్ళు వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేయవలసి ఉంటుంది. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో మంత్రులను తొలగిస్తే వారు అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రిపదవులు లభించని అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించవలసి ఉంటుంది లేకుంటే బిజెపిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక మంత్రివర్గ విస్తరణ అనే తేనెతుట్టెలో నుంచి సిఎం కేసీఆర్‌ చాలా ఒడుపుగా తేనెను తీయవలసిఉంటుంది. అది ఎప్పుడు, ఏవిధంగా చేస్తారో చూడాలి.


Related Post