పాక్ దుస్సాహసానికి సిద్దమవుతోందా?

August 27, 2019


img

కశ్మీర్‌పై భారత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్‌కు ప్రపంచదేశాలు మద్దతు ఇవ్వకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది. పైగా ఇదే సమయంలో ఉగ్రవాదులకు ఆర్ధికవెసులుబాటు కల్పిస్తున్నందుకుగాను ‘ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టీం (ఎఫ్ఎటిఎఫ్) పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టబోతున్నట్లు ప్రకటించింది. భారత్‌ ఒత్తిడి, పలుకుబడితోనే ప్రపంచదేశాలు పాకిస్థాన్‌కు సహాయనిరాకరణ చేస్తున్నాయని, పాకిస్థాన్‌ను ఆర్ధికంగా దెబ్బ తీసేందుకు భారత్‌ కుట్రలు చేస్తోందని పాక్‌ పాలకుల వాదిస్తున్నారు. 

ఈ పరిణామాలపై పాక్‌ ప్రభుత్వం ఏమీ చేయలేక నిస్సహాయంగా చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తుండటంతో పాక్‌ ప్రజలు, ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వమని విమర్శిస్తున్నారు. కనుక ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి లోనవడం సహజమే. ఆ ఒత్తిడిలోనే “కశ్మీర్‌ సమస్యపై నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని భారత్‌తో అణుయుద్ధానికి సిద్దమని” మొన్న ప్రకటించారు. 

మరోపక్క భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటోంది. ఇటీవల పంజాబ్ సరిహద్దులో గల సట్లెజ్ నదిపై నిర్మించిన డ్యామ్ గేట్లను ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఎత్తివేయడంతో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. తాజాగా పాక్‌ గగనతలాన్ని, రోడ్డు మార్గాలను భారత్‌ వినియోగించుకోకుండా మూసివేయాలనుకొంటున్నట్లు పాక్‌ మంత్రి ఫవాడ్ హుస్సేన్ ట్వీట్ చేశారు. మరోపక్క కశ్మీర్‌ సరిహద్దులకు అతి సమీపంలో 100 మంది పాక్‌ కమెండోలను మోహరించింది. వారు ఉగ్రవాదులతో కలిసి భారత్‌ సరిహద్దు భద్రతాదళాలపై దాడి చేసేందుకు సిద్దమవుతున్నట్లు నిఘా వర్గాల హెచ్చరికలతో భారత్‌ ఆర్మీ, వాయుసేన అప్రమత్తం అయ్యింది.  మూడు రోజుల క్రితం తమిళనాడులోకి ముగ్గురు ఉగ్రవాదులను ప్రవేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

పాక్‌ ప్రజలను, ప్రతిపక్షాలను సంతృప్తి పరచడానికి పాక్‌ పాలకులు, సైన్యాధికారులు ఏదో ఒక దుస్సాహసానికి పూనుకొనేందుకు వెనుకాడకపోవచ్చు కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రజలు కూడా అప్రమత్తంగా మెలగడం చాలా అవసరమే.



Related Post