కె.లక్ష్మణ్ బస్తీ మే సవాల్!

August 27, 2019


img

కాంగ్రెస్‌ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తుంటే, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం వారిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికధరలకు విద్యుత్ కొనుగోళ్ళు చేసిన మాట వాస్తవమా కాదా? రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని మీరే చెపుతుంటారు. మరి అవసరం లేనప్పటికీ అదనపు విద్యుత్ ఎందుకు కొనుగోలు చేశారు?దానిలో ఎంత వాడేరు?ఎక్కడ వాడేరు? ఎంత మిగిలిపోయింది? ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయని సంస్థల నుంచి నిర్దేశించిన పెనాల్టీ వసూలు చేయరాదని ప్రభుత్వం ఎందుకు ఉత్తర్వులు జారీ చేసింది?

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? ఎత్తిపోతల పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్లు బకాయిలు ఉన్నమాట వాస్తవమా కాదా? అదేవిధంగా ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి రూ.1,800 కోట్లు, సౌర విద్యుత్ సరఫరా సంస్థలకు రూ.3,000 కోట్లు బకాయిలు ఉన్నమాట వాస్తవమా కాదా?

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న తప్పుడు నిర్ణయాల వలన ప్రభుత్వంపై రూ.8,000 కోట్లు అదనపు భారం పడిన మాట వాస్తవమా కాదా?దానిని ప్రజలపైనే రుద్దకుండా ఉంటారా? నా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. విద్యుత్, పరికరాల కొనుగోళ్ళలో అవకతవకలపై సిబిఐ విచారణకు సిద్దమని ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు చేత మాకు సవాలు విసిరారు. మేము కూడా అందుకు సిద్దమే. దీనిపై మేము త్వరలోనే కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేయబోతున్నాము. వీటికి సంబందించిన పూర్తి సాక్ష్యాధారాలన్నీ మావద్ద సిద్దంగా ఉన్నాయి. వాటిని దర్యాప్తు సంస్థకు ఇస్తాము. కనుక తెరాస సర్కార్‌ సిబిఐ దర్యాప్తుకు సిద్దంగా ఉండాలి,” అని సవాలు విసిరారు.


Related Post