దమ్ముంటే సిబిఐ విచారణ జరిపించండి: తెరాస

August 27, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌, బిజెపి నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట తెరాస నేతలు భారీగా అంచనాలు పెంచేసి అవినీతికి పాల్పడ్డారని వాఋ ప్రధాన ఆరోపణ. అయితే తెరాస నేతలు ఇంతవరకు వాటికి నేరుగా సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజలు కూడా వారి ఆరోపణలు నిజమని నమ్మే ప్రమాదం ఏర్పడిందని తెరాస గుర్తించినట్లే ఉంది. అందుకే మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా కాంగ్రెస్‌, బిజెపి నేతలకు ఘాటైన సమాధానం ఇప్పించింది. 

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడూ చేయలేని పనులను మా ప్రభుత్వం కేవలం 3 ఏళ్ళలోనే చేసి చూపిస్తే ఓర్వలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిపోయిందని వాదిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి నేతలకు దమ్ముంటే దానిపై సిబిఐ విచారణ జరిపించాలి. నిజానిజాలేమిటో వారికీ తెలుస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని మేము పదేపదే కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నా స్పందించడంలేదు. రాష్ట్ర బిజెపి నేతలు డిల్లీ వెళ్ళి తమ అధిష్టానాన్ని ఒప్పించి జాతీయహోదా ఇప్పించవచ్చు కదా? వారు చేయవలసిన పని చేయకుండా మాపై విమర్శలు చేయడం దేనికి? కాంగ్రెస్‌ నేతలు తమ్మిడిహెట్టికి వెళ్ళేబదులు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి ఉంటే వారికి వాస్తవ పరిస్థితులు అర్ధమయ్యుండేవి. కానీ వారికి వాస్తవాలు అవసరం లేదు. మా ప్రభుత్వంపై ఏవిధంగా బురదజల్లాలనేదే వారికి ముఖ్యం. వారికి మళ్ళీ ప్రజలే తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు. 

ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బిజెపి నేతల ఆరోపణలకు తెరాస ఈస్థాయిలో సమాధానం చెప్పకపోవడం వలననే వారు ఆరోపణలు చేయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు తెరాస స్వయంగా సిబిఐ విచారణ జరిపించుకోమని వారికి సవాలు విసిరింది కనుక ఇప్పుడు బంతి వారి కోర్టులో ఉంది. కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉంది కనుక తెరాస సవాలును స్వీకరించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందా? లేకుంటే రాష్ట్ర బిజెపి నేతలు రాజకీయ దురుదేశ్యంతోనే తెరాస సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నట్లవుతుంది.


Related Post