కోడెల పరువు పాయె...

August 27, 2019


img

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరువు హైకోర్టు చేతిలోకి వెళ్లింది. హైదరాబాద్‌ అసెంబ్లీలో తన కార్యాలయంలో కంప్యూటర్స్, ఫర్నీచర్‌ వగైరాలను అమరావతిలో అసెంబ్లీకి తరలిస్తున్నప్పుడు, కోడెల వాటిని నేరుగా తన ఇంటికి తరలించుకుపోయారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఎవరూ వేలెత్తి చూపలేదు. కానీ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టాక వాటి గురించి గట్టిగా నిలదీయడంతో కోడెల అడ్డంగా దొరికిపోయారు.

వాటిని తన ఇంట్లో భద్రపరిచానని, కావాలంటే వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిస్తానని లేదా వాపసు చేస్తానని అంటున్నారు. కానీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయనపై పోలీసులు దొంగతనం కేసు నమోదు చేయడంతో కోడెలకు అరెస్ట్ భయం పుట్టుకొని గుండెపోటు తెచ్చుకొని ఆసుపత్రిలో చేరారు.

ముందస్తు జాగ్రత్త పడుతూ హైకోర్టులో ఒక పిటిషన్‌ కూడా వేశారు. తన వద్ద ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ వగైరాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించడానికి సిద్దంగా ఉన్నానని అందుకు ప్రభుత్వం అంగీకరించకపోతే వాటిని తీసుకుపోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన పిటిషన్‌ వేశారు.

అంటే ఆయన తప్పును పోలీసులు దర్యాప్తు చేసి కోర్టుకు సాక్ష్యాధారాలతో నిరూపించే శ్రమ లేకుండా ఆయనే స్వయంగా లిఖితపూర్వకంగా హైకోర్టుకు విన్నవించుకున్నారన్న మాట! కనుక ఇప్పుడు ఆయన పరువు హైకోర్టు చేతిలో ఉంది. ఒకవేళ హైకోర్టు కూడా నిరాకరిస్తే కోడెలకు కష్టాలు మొదలైనట్లే!


Related Post