లౌకికవాదం వద్దు..మతవాదమే ముద్దు: మజ్లీస్

August 27, 2019


img

మజ్లీస్ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, “లౌకికవాదం పేరుతో ఓట్లు దండుకొంటున్న నేతలను మోయవలసిన అవసరం ముస్లింలకు లేదు. ఇంకా ఎంతకాలం వారిని మోస్తాం? అసలు లౌకికవాద పార్టీలకు మనం ఎందుకు ఓట్లు వేయాలి?ముస్లిం ప్రజల నుంచే నాయకులు ఉద్భవించాలంటే మనం కుహనా లౌకికవాదులను, వారి పార్టీలను పక్కన పెట్టి ముస్లిం నేతలనే ఎన్నుకోవాలి. రాజ్యాంగం మనకు ఆ హక్కును కల్పించింది,” అని అన్నారు.  

భారతదేశంలో భిన్నమతాల ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తుండటానికి కారణం భారత్‌ ఎంచుకున్న        లౌకికవాదమేనని అందరికీ తెలుసు. అదే నేటికీ దేశ సమగ్రతను కాపాడుతోంది. అయితే గత కొన్ని దశాబ్ధాలుగా లౌకికవాదం అనేది రాజకీయబాషలో ఒక పదంగా మారిపోయింది. ఓట్ల కోసమే వినియోగించే ఒక సాధనంగా మారిపోయింది. దేశంలో దాదాపు అన్ని పార్టీలు తమది లౌకికవాదమేనని చెప్పుకొంటూనే కులాలు,మతాల వారీగా రాజకీయాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

కొన్ని పార్టీలు మతరాజకీయాలు చేస్తుంటాయి. బహిరంగంగానే మతతత్వవాదాన్ని ప్రదర్శిస్తూ ఆ వర్గం ప్రజలను గుప్పెట్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ప్రభుత్వాలు, వాటిని నడిపిస్తున్న రాజకీయ పార్టీలు లౌకికవాదానికి నిఖచ్చిగా కట్టుబడి ఉండనప్పటికీ, దేశప్రజలు మాత్రం నేటికీ లౌకికవాదానికే కట్టుబడి జీవనం సాగిస్తున్నారు. అందుకే మతతత్వపార్టీలు ఎంతగా ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పటికీ దేశసమగ్రత, జాతీయభావం ఇంకా నిలిచిఉన్నాయని చెప్పవచ్చు. 

దేశాన్ని కాపాడుతున్న అటువంటి లౌకికవాదమే మనకు బరువు. దానిని ఇక భరించవలసిన అవసరం లేదు. మన మతమే మనకు ముద్దు. కనుక మనవారినే ఎన్నుకొందాం, అని చెపుతున్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఒక ఎంపీగా దేశసమగ్రతను బలపరిచేవిధంగా ప్రజలను ఐక్యపరిచే ప్రయత్నం చేయకుండా, తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈవిధంగా మాట్లాడటం దురదృష్టకరమే. ముస్లింలు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ ఆ పేరుతో తమపార్టీకె గంపగుత్తగా ఓట్లు వేయాలని కోరడమే తప్పు.


Related Post