త్వరలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు

August 26, 2019


img

లోక్‌సభ ఎన్నికల కారణంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మార్చి నెలలో ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాయి. సాధారణంగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు కేటాయించిన నిధులు, పధకాలను బట్టి రాష్ట్రాలు కూడా తదనుగుణంగా బడ్జెట్ రూపొందించుకొంటుంటాయి. లోక్‌సభ ఎన్నికలు పూర్తవగానే కేంద్రప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రూపొందించలేదు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకవుతోందో కారణాలు తెలియవు. బడ్జెట్ సిద్దమైతే అసెంబ్లీ సమావేశాల నిర్వహిస్తారు కనుక ఇంతవరకు అవి కూడా జరుగలేదు. కొన్ని ముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల రెండురోజులు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది అంతే. ఆ తరువాత బడ్జెట్ ఊసే వినబడలేదు. 

ఎట్టకేలకు, పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందించడానికి సిఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి చేపట్టిన బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఆర్ధికశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.  

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం ప్రభావం కనిపిస్తున్నందున ఈసారి ఆదాయం, అవసరాలను ఖచ్చితంగా గుర్తించి వాస్తవికకు దగ్గరగా తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించాలని సిఎం కేసీఆర్‌ వారిని కోరారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలుగకుండా వీలైనంత వరకు పొదుపుగా కేటాయింపులు జరపాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ రూపొందించిన తరువాత మంత్రివర్గం సమావేశం నిర్వహించి దానికి ఆమోదం తీసుకొని శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 


Related Post