యుద్ధం తెరాస-బిజెపిల మద్య కాదు కేసీఆర్‌...

August 26, 2019


img

ప్రస్తుతం రాష్ట్రంలో తెరాస-బిజెపి నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. పైకి అవి తెరాస-బిజెపి నేతల మద్య జరుగుతున్న యుద్ధాలుగా కనిపిస్తున్నప్పటికీ, వాటి వెనుక తెలంగాణ సిఎం కేసీఆర్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలున్నారని చెప్పకతప్పదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలో సిఎం కేసీఆర్‌ తెరాస నేతలకు మార్గదర్శనం చేస్తున్నట్లే, రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకొని తెరాసపై పైచెయ్యి సాధించడానికి ఏవిధంగా ముందుకు సాగాలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర బిజెపి నేతలకు మార్గదర్శనం చేస్తుంటారనేది అందరికీ తెలిసిందే. కనుక తెలంగాణ రాష్ట్రంలో పరోక్షంగా కేసీఆర్‌-అమిత్ షాల మద్య రాజకీయ యుద్ధం జరుగుతున్నట్లే చెప్పవచ్చు. 

రాజకీయ ఎత్తుగడలు, వాటిని అమలుచేయడంలో కేసీఆర్‌-అమిత్ షా ఇద్దరూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరని అందరికీ తెలుసు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో బిజెపిని గెలిపించుకొని అమిత్ షా తన సత్తా చాటుకుంటే, తెలంగాణలో వరుసగా రెండుసార్లు తెరాసను ఒంటిచేత్తో గెలిపించుకొని సిఎం కేసీఆర్‌ తన సత్తా చాటుకున్నారు. కనుక ఇప్పుడు తెలంగాణ వేదికగా ఈ రాజకీయయుద్ద నిపుణుల మద్య మొదలైన ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో భవిష్యత్తులో తెలుస్తుంది.


Related Post