ఏపీలో రాజకీయ వరదలు

August 22, 2019


img

వరదలు వస్తే ఇళ్ళూ.. ఊళ్ళు మునిగిపోవడం తెలుసు కానీ రాజకీయపార్టీలు కూడా మునిగిపోతాయని ఏపీ రాజకీయాలు నిరూపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం వరద రాజకీయాలు సాగుతున్నాయి. దానినే మరోవిధంగా చెప్పాలంటే రాజకీయ వరదలు కొనసాగుతున్నాయి. 

ఇటీవల ఎగువనుంచి కృష్ణా నదిలోకి బారీగా నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు నీళ్ళు వదలడంతో అమరావతి పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కృష్ణానది ఒడ్డున చంద్రబాబునాయుడు నివాసం కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. ముంపు ప్రాంతమైన అమరావతిలో రాజధాని నిర్మించడం సరికాదని ఆనాడు తాము వారించినప్పటికీ చంద్రబాబునాయుడు వినలేదని అందుకే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు వాదిస్తున్నారు. అలాగే నదీతీరానికి 500 మీటర్లలోపు కట్టడాలు కట్టకూడదనే నిబందనలను పట్టించుకోకుండా నిర్మించిన అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకునందునే దానికీ ముంపు ప్రమాదం ఏర్పడిందని వైసీపీ వాదన.

చంద్రబాబునాయుడుతో సహా టిడిపి నేతలు ఇందుకు పూర్తి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. అమరావతిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకే జగన్ ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందని వాదిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని కాలువల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆవిధంగా చేయకుండా, ప్రకాశం బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీరు నింపి ఒకేసారి అన్ని గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడం వలననే అమరావతి ముంపుకు గురైందని వాదిస్తున్నారు. అమరావతి ముంపు ప్రాంతమని నిరూపించేందుకు జగన్ ప్రభుత్వం ఇంత దారుణానికి పాల్పడిందని టిడిపి నేతల వాదన. 

పోలవరం పనులు నిలిపివేత, అమరావతి తరలింపు వంటి కీలకమైన అంశాల గురించి తమ ప్రభుత్వం ముందుగానే ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రహోంమంత్రి అమిత్ షాకు చెప్పి వారి అనుమతి తీసుకున్నాకే ముందుకు సాగుతున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పడంతో టిడిపి వాదనలు నిజమని దృవీకరించినట్లయింది.

అయితే ఇప్పుడు బిజెపిని, కేంద్రప్రభుత్వాన్ని కూడా ఈ వరద రాజకీయాలలోకి లాగినట్లయింది. “మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే ముందుకు సాగుతున్నాం,” అని చెప్పడంతో ఏపీలో టిడిపిని, చంద్రబాబునాయుడుని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

“రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ నాపై రాజకీయకక్షతో అమరావతి ప్రజలందరికీ ఈవిధంగా నష్టం, అన్యాయం చేయడం సరికాదు, అమరావతిని వేరే చోటికి తరలించేందుకు ఇంత కుట్ర అవసరమా?” అని చంద్రబాబునాయుడు ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణ ఏర్పడిన 5 ఏళ్ళలో సిఎం కేసీఆర్‌ అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేశారో... ఇంకా చేస్తున్నారో అందరూ చూస్తునే ఉన్నారు. కానీ ఏపీలో మాత్రం నాటి నుంచి నేటి వరకు అధికార, ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి గట్టి ప్రయత్నాలు చేయకుండా ఈవిధంగా రాజకీయాలతో కాలక్షేపం చేస్తుండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమే.


Related Post