కొడుకు బాటలోనే తండ్రి!

August 21, 2019


img

సాధారణంగా తండ్రి అడుగుజాడలలో పిల్లలు నడవాలనుకుంటారు. కానీ తెరాస రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్)మాత్రం కొడుకు ధర్మపురి అరవింద్ బాటలో నడుస్తూ బిజెపిలో చేరాలనుకొంటున్నారు. నిజానికి ఆయన తెరాసకు దూరమైనప్పుడే బిజెపిలో చేరాలనుకున్నారు. కానీ ఆలాచేస్తే అనర్హత వేటు పడుతుందనే భయంతో వెనక్కు తగ్గారు. ఆయన తెరాసకు దూరమైన తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తరపున నిలబడిన తన కుమారుడు ధర్మపురి అరవింద్‌ను గెలిపించుకోవడానికి చాలా కృషి చేశారు. అందుకే తెరాస సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి డిఎస్ కూడా ఒక కారణమని తెరాస నేతలు సైతం అంగీకరిస్తుంటారు. 

తన తండ్రి శ్రీనివాస్ త్వరలోనే బిజెపిలో చేరబోతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. అంటే ఆయన చేరిక ఖాయం అయినట్లే. కానీ ఆయన పదవీకాలం జూన్ 2022 వరకు ఉంది కనుక ఒకవేళ ఆయన బిజెపిలో చేరితే ఆయనపై అనర్హత వేటు వేయాలని తెరాస అభ్యర్ధించడం ఖాయం. ఒకవేళ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిబంధనల ప్రకారం వ్యవహరించదలిస్తే డిఎస్‌పై వేటు వేయవచ్చు. 

కనుక డిఎస్ అందుకు సిద్దపడే బిజెపిలో చేరబోతున్నారా లేక తన పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరుతారా? లేక ఆయన పదవికి ప్రమాదం ఉండదని బిజెపి హామీ ఇస్తునందునే చేరబోతున్నారా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించవచ్చు. 



Related Post