రెవెన్యూ చట్టంపై మీ అభిప్రాయాలు ఏమిటి? కేసీఆర్‌

August 19, 2019


img

సిఎం కేసీఆర్‌ సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి తీసుకువచ్చేందుకు సిద్దపడుతున్నందున దాని కోసం జిల్లా కలెక్టర్ల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు సిఎం కేసీఆర్‌ వారితో నేడు సమావేశం కానున్నారు. జిల్లా కలెక్టర్ల సూచనలు, సలహాల మేరకు కొత్త రెవెన్యూ చట్టంలో నిబందనలలో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. తద్వారా రెవెన్యూశాఖను పూర్తి పారదర్శకంగా మార్చి అవినీతిరహితంగా తీర్చిదిద్దాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రజలకు ముఖ్యంగా...గ్రామాలలోని రైతులకు రెవెన్యూశాఖలో పనులు సౌకర్యవంతంగా జరిగేలా కొత్తచట్టాన్ని తీర్చిదిద్దాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. నిత్యం క్షేత్రస్థాయిలో తిరుగుతూ భూ వ్యవహారాలు, రైతుల సమస్యలపై మంచి అవగాహన కలిగిన జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడం చాలా అవసరమని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టాలపై కూడా సిఎం కేసీఆర్‌ వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకొంటారు. 

‘చట్టంలో ప్రతీ వాఖ్యం నేనే స్వయంగా వ్రాయించాను’ అని చెప్పుకునే సిఎం కేసీఆర్‌, వాటిని రూపొందించే ముందు ఈవిధంగా జిల్లా కలెక్టర్లతో, సంబందిత అధికారులతో సమావేశమై వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకోవాలనుకోవడం, తదనుగుణంగానే చట్టాలను రూపొందించాలనుకోవడం ఆశ్చర్యకరమే. అందుకు బలమైన కారణమే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరును అందిస్తున్న రెవెన్యూశాఖపై సిఎం కేసీఆర్‌ అవినీతిముద్ర వేసి దానిని రద్దు చేయాలనుకొంటున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నందున, భవిష్యత్తులో వారు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది లేదా సహాయనిరాకరణ చేయవచ్చు. బహుశః అందుకే రెవెన్యూ చట్టం రూపకల్పనలో సిఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లను కూడా భాగస్వాములుగా చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.     



Related Post