కాంగ్రెస్‌ వ్యూహం ఫలిస్తుందా?

August 19, 2019


img

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ పరస్పరం విమర్శలు చేసుకొంటూనే, తెరాస సర్కార్‌పై కూడా విమర్శలు గుప్పిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌-తెరాసలు కుమ్మక్కయ్యాయని బిజెపి, తెరాస-బిజెపిలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించుకోవడం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ కుమ్మక్కు విమర్శలపై తెరాస స్పందించకపోవడం వ్యూహాత్మక మౌనమే అనుకోవాలేమో? 

కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెరాస-బిజెపిల మద్య ఎటువంటి బంధం లేదని నిరూపించుకోవడానికి   కేంద్రప్రభుత్వానికి ఒక పరీక్ష పెట్టారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు సంక్షేమ పధకాల వరకు ప్రతీ దానిలో భారీగా అవినీతి జరుగుతోందని బిజెపి నేతలే ఆరోపిస్తున్నారు. కానీ తెరాస సర్కార్‌ అవినీతిపై కేంద్రప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించడం లేదంటే తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉన్నందునే. గత 5 ఏళ్ళుగా నరేంద్రమోడీకి అన్ని విధాలా సహకరించిన సిఎం కేసీఆర్‌, ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు. అందుకే కేంద్రప్రభుత్వం తెరాస సర్కార్‌ అవినీతిని పట్టించుకోవడం లేదు. ఒకవేళ తెరాస-బిజెపిల మద్య ఎటువంటి రహస్య అవగాహన లేదంటే కేంద్రప్రభుత్వం తెరాస సర్కార్‌పై అవినీతిపై దర్యాప్తు జరిపించాలి. లేదంటే ప్రజలను మభ్యపెట్టేందుకు రాష్ట్ర బిజెపి నేతలు తెరాస సర్కార్‌పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. త్వరలోనే నేను కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి తెరాస సర్కార్‌ అవినీతిపై దర్యాప్తుకు ఆదేశించవలసిందిగా కోరుతాను,” అని అన్నారు. 

గత 5 ఏళ్ళలో కేసీఆర్‌-మోడీ స్నేహం కారణంగా రాష్ట్రంలో బిజెపి రాజకీయంగా దెబ్బతింది. కనుక ఈసారి ఆ స్నేహాన్ని పక్కన పెట్టి తెరాస సర్కార్‌పై బిజెపి కత్తులు దూస్తూ యుద్ధం చేస్తోంది. కానీ తెరాస-బిజెపిల మద్య నేటికీ అవగాహసన ఉందని, అందుకే కేంద్రప్రభుత్వం తెరాస సర్కార్‌ అవినీతిని పట్టించుకోవడంలేదనే భట్టి విక్రమార్క వాదన కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహంగా కనిపిస్తోంది. 

కేంద్రప్రభుత్వాన్ని తెరాస సర్కార్‌పై ఉసిగొల్పడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒకేసారి తెరాస, బిజెపిలను రెంటినీ దెబ్బ తీయాలని కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ కేంద్రప్రభుత్వం తెరాస సర్కార్‌పై దర్యాప్తుకు ఆదేశిస్తే రాష్ట్రంలో బిజెపికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవవచ్చు. కనుక ఎటువంటి చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్‌ ఈ వాదనతో ముందుకు సాగుతూ ఆ రెండు పార్టీలను ఎండగటవచ్చు. కాంగ్రెస్‌ వ్యూహం బాగానే ఉంది కానీ బిజెపి, తెరాసలు దాని ఉచ్చులో పడతాయనుకోవడం అత్యాశే అవుతుంది. 


Related Post