తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగలదా?

August 14, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకొని అధికారంలోకి రావాలనుకొంటున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితరులు పదేపదే చెపుతున్నారు. 1. ఇతర పార్టీల నేతలను బిజెపిలో చేర్చుకోవడం, 2. రాష్ట్రంలో సభ్యత్వాలు పెంచుకోవడం, 3. సిఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాడటం అనే మూడు మార్గాలు ఎంచుకున్నట్లు స్పష్టం అవుతోంది. 

ఇతర పార్టీల నేతలను చేర్చుకున్నంత మాత్రన్న పార్టీ బలపడదని, పార్టీకి గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉన్నప్పుడే నిజంగా బలపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన డికె.అరుణ వంటి మంచి బలమైన నాయకురాలు మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె వెంట కాంగ్రెస్‌ క్యాడర్ బిజెపిలోకి తరలిరాకపోవడమే ఆమె ఓటమికి కారణమని అర్ధమవుతోంది. అంటే తలసాని వాదన సహేతుకంగానే ఉందని అర్ధమవుతుంది. మరి ఈవిషయం బిజెపి గ్రహించిందో లేదో తెలియదు.

పార్టీ సభ్యత్వాలు పెంచుకోవడం వలన పైకి పార్టీ బలం పెరిగినట్లు కనబడుతుంది. కానీ పార్టీలు ఇచ్చే ప్రమాదభీమా కోసమో లేక పార్టీ గుర్తింపు కార్డు ఉంటే మంచిదనే ఉద్దేశ్యంతో పార్టీ సభ్యత్వాలు తీసుకునేవారే ఎక్కువ. ఎన్నికలు లేనప్పుడు వారి వలన పార్టీలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలం. కనుక సభ్యత్వాలు పెరిగితే అది వాపా బలుపా? అని అన్ని పార్టీలు ఆలోచించుకోవలసి ఉంటుంది. 

ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమే కనుక బిజెపి కూడా సిఎం కేసీఆర్‌ను..ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని సరిపెట్టుకోవచ్చు. అయితే అత్యంత ప్రజాధారణ ఉన్న సిఎం కేసీఆర్‌పై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? వారు మెల్లగా బిజెపివైపు ఆకర్షితులవుతారా? లేక బిజెపికి మరింత దూరం అవుతారా? ప్రజలు మన నుంచి ఏమి ఆశిస్తున్నారు? అని బిజెపి నేతలే ఆలోచించుకుంటే మంచిది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్షాలన్నీ సిఎం కేసీఆర్‌ను..ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. కానీ రాష్ట్ర ప్రజలు సిఎం కేసీఆర్‌కే మళ్ళీ భారీ మెజార్టీతో పట్టం కట్టారు. అంటే సిఎం కేసీఆర్‌ను విమర్శించడం వలన రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకోలేమని స్పష్టం అయ్యింది. 

కనుక రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలు చేయగలిగితే వారు ఆశిస్తున్న ఫలితం లభించవచ్చు. 


Related Post