గాంధీభవన్‌ ఫర్ సేల్: కె.లక్ష్మణ్‌

August 10, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌, దాని అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టికల్ 370, జమ్ముకశ్మీర్‌ విభజన గురించి చర్చించేందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్దంగా ఉండాలి. దేశ అంతర్గత సమస్యను అంతర్జాతీయ సమస్యగా కాంగ్రెస్‌ నేతలు వాదిస్తుండటం దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేదిగా ఉంది. రాష్ట్రంలో... దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతోంది. త్వరలోనే ‘గాంధీభవన్‌ ఫర్ సేల్’ అనే బోర్డు పెట్టుకోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మరి తమ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరుపడం లేదో చెప్పగలరా? రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిచకపోయినా ఈసారి కేంద్రహోంమంత్రి అమిత్ షా నిర్వహిస్తారు. రాష్ట్రంలో బిజెపికి బలం ఎక్కడుందని ఎద్దేవా చేస్తున్న కేటీఆర్‌ నిజామాబాద్‌కు వెళ్ళి చూస్తే కనిపిస్తుంది,” అని అన్నారు. 

కశ్మీర్ అంశాలపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దేశప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ వాటి వలన మంచి జరుగుతుందని, మళ్ళీ జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్న కారణంగా ఆ నిర్ణయాలను సమర్ధిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. కానీ దీనిపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరి, వాదనలపై ఆ పార్టీలోనే కొంత వ్యతిరేకత..భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగా కాంగ్రెస్‌ నేతలలో కొంత గందరోగోళం నెలకొని ఉంది. అందుకే ఆ అంశంపై చర్చకు రావాలని కె.లక్ష్మణ్‌ కాంగ్రెస్‌ నేతలకు సవాలు విసురుతున్నారనుకోవచ్చు. 

అమిత్ షా ఈసారి కేంద్రహోంమంత్రి హోదాలో రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపదలిస్తే తెరాస సర్కారుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. అదే...యధాప్రకారం బిజెపి జాతీయ అధ్యక్షుడు హోదాలో పార్టీ పరంగా నిర్వహించదలిస్తే తెరాస సర్కారుకు ఎటువంటి ఇబ్బందీ ఉండబోదు. 

గాంధీభవన్‌కు ‘టులెట్’ లేదా ‘ఫర్ సేల్’ బోర్డు తగిలించేస్తారని కె.లక్ష్మణ్‌తో అనడం సరికాదని చెప్పక తప్పదు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ 18 సీట్లు గెలుచుకుంటే బిజెపి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకొంది. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ స్థానాలు గెలుచుకొంది. లోక్‌సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ 4-5 స్థానాలు గెలుచుకోవలసింది కానీ తృటిలో చేజార్చుకొంది. అంటే రాష్ట్రంలో నేటికీ బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉందని అర్ధం అవుతోంది. 

కానీ ఆ పార్టీ నేతలను, ప్రజాప్రతినిధులను తెరాస, బిజెపిలు తమ పార్టీలలోకి ఫిరాయింపజేసుకొంటున్నందునే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది తప్ప రాష్ట్రంలో బలం కోల్పోయినందున కాదని చెప్పవచ్చు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తమ విభేధాలను, పదవుల కోసం కీచులాటలను పక్కనపెట్టి, తమ బలహీనతలను అధిగమించి ఒక్కతాటిపైకి వస్తే వారిని ఎదుర్కోవడం తెరాస, బిజెపిలకు చాలా కష్టమే కానీ కాంగ్రెస్‌లో అది సాధ్యం కాదు కనుక ఆ పార్టీ నానాటికీ బలహీనపడుతోంది అంతే! 


Related Post