ఆ కామెంట్లు నన్ను బాధించాయి: కేటీఆర్‌

August 10, 2019


img

తెలంగాణ వికాస సమితి 3వ రాష్ట్రమహాసభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సభకు వచ్చినవారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొనున్నాయి. జాతీయవాదం, మతం రెండూ పెనవేసుకుపోయాయి. మహాత్మా గాంధీజీని కాల్చి చంపిన నాధూరామ్ గాడ్సేను దేశభక్తుడని సాధ్వి ప్రజ్ఞాసింగ్ అంటే నేను ఖండించాను. దానికి సోషల్ మీడియాలో నాపై కొందరు కొన్ని కామెంట్స్ చేశారు. అవి చూసి నేను చాలా బాధపడ్డాను. జాతిపిత గాంధీజీని గౌరవించుకోలేని జాతి మనది. ఏదైనా అంశంపై తర్కించుకొని విభేధించుకునే పరిస్థితులు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్దమే లేదు,” అని అన్నారు. 

కేటీఆర్‌ చెప్పింది సహేతుకంగానే ఉంది. అయితే సిఎం కేసీఆర్‌ గతంలో స్వర్గీయ నెహ్రూ, స్వర్గీయ ఇందిరాగాంధీలను ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడినపుడు, అలాగే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశ్యించి సన్నాసులు, దద్దమ్మలు అన్నప్పుడు, తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌తో భుజం భుజం కలిపి పనిచేసిన కోదండరాంను ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడినప్పుడు, సాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశ్యించి దొంగ, రాక్షసుడు అంటూ మాట్లాడినప్పుడు వారు కూడా ఇంతకంటే ఎక్కువగానే బాధపడి ఉంటారు. కనుక రాజకీయాలలో మనం ఒక మెట్టు దిగితే ఎదుటవాడు రెండు మెట్లు దిగుతాడని గుర్తుంచుకొని అందరూ హుందాగా ప్రవర్తించడం అవసరం లేకుంటే బురదపై రాయి విసిరినట్లే అవుతుందని మరిచిపోకూడదు. 

ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయో బహుశః కేటీఆర్‌కు కూడా తెలిసే ఉంటుంది. తెరాస సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏనాడూ ఏవిషయంలోనూ ప్రతిపక్షాలను సంప్రదించిన దాఖలాలు లేవు. అన్ని ఏకపక్ష నిర్ణయాలే. వాటిపై ప్రతిపక్షాలు విమర్శలు, న్యాయపోరాటాలు చేస్తున్నప్పుడైనా వాటితో చర్చించాలనుకోలేదు. తెరాస విధానాలను వ్యతిరేకించడం అంటే రాష్ట్రాన్ని...అభివృద్ధిని వ్యతిరేకించడమేననే ఒక విచిత్రమైన సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే వాటిని విమర్శలుగా భావిస్తూ తెరాస ఏవిధంగా తిప్పికొడుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే రాష్ట్రంలో చర్చకు, విభేదించడానికి తావు లేదన్నమాట! కనుక రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని బాధపడటం వలన ఉపయోగం ఉండదు.

ఇక దేశంలో మతం, జాతీయవాదం పెనవేసుకుపోతున్న మాట వాస్తవం. "నాతో ఉంటే దేశభక్తుడివి లేకుంటే దేశద్రోహివి" అనే వాదన తనకు చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఇంచుమించు ఇటువంటి వాదనే తెలంగాణ సెంటిమెంటు రూపంలో దర్శనమిస్తుంటుంది. రాష్ట్రంలో తెరాస కాకుండా వేరే ఏ పార్టీ బరిలో ఉన్నా వాటి వలన రాష్ట్రానికి నష్టం లేదా ప్రమాదం పొంచి ఉందనే వాదనతో తెరాస ఎన్నికల పరీక్షలలో ఉతీర్ణం అవ్వాలనుకోవడం అందరికీ తెలుసు. కనుక అన్ని పార్టీలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండటం, హుందాగా ప్రవర్తించడం చాలా అవసరమని స్పష్టం అవుతోంది. కాదనుకుంటే దానికి రాజకీయ నాయకులే మూల్యం చెల్లించవలసి వస్తుంది తప్ప ప్రజలు కాదు. 


Related Post