త్వరలో టిటిడిపికి టులెట్ బోర్డు?

August 10, 2019


img

రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో టిడిపి గౌరవప్రదమైన సీట్లే సంపాదించుకోగలిగింది. కానీ ఆ తరువాత ఫిరాయింపులతో తెలంగాణలో దాని పతనం ప్రారంభం అయ్యింది. 2019 ఎన్నికలలో తన రాజకీయ శత్రువు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేదు. అదే సమయంలో ఏపీలో కూడా టిడిపి అధికారం కోల్పోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపి నేతలు, ప్రజాప్రతినిధులు బిజెపిలోకి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. 

ఈనెల 18వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌ వస్తున్నారు. ఆ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఆ సభలో ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, మెదక్‌, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన పలువురు టీటీడీ నేతలు, వారి అనుచరులు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. టిడిపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు నేతృత్వంలో వారందరూ బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నాంపల్లి బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ఆయనే చూస్తున్నట్లు సమాచారం. 

ఏపీలో టిడిపిని కాపాడుకోలేక ఇబ్బందిపడుతున్న చంద్రబాబునాయుడు, తెలంగాణలో ఇప్పటికే సగంపైగా ఖాళీ అయిపోయిన టిడిపిని కాపాడుకోగలరనుకోలేము. కనుక ఆగస్ట్ 18న తెలంగాణలో టిడిపి దాదాపు ఖాళీ అయిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆరోజు బహిరంగసభలో కాంగ్రెస్‌, తెరాసలకు చెందిన కొందరు నేతలు బిజెపిలో చేరవచ్చునని సమాచారం. 

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మళ్ళీ సెప్టెంబర్ 17న నిజామాబాద్‌లో నిర్వహించబోయే తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తారని, ఇకపై అమిత్ షా తెలంగాణపై దృష్టి సారిస్తారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు.


Related Post